సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. తనదైన శైలిలో రెచ్చిపోయి 120 బంతుల్లోనే 135 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆదివారం (నవంబర్ 30) రాంచీ వేదికగా జరిగిన ఈ వన్డేలో విరాట్ తన పాత ఫామ్ ను గుర్తు చేస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీకి వన్డే ఫార్మాట్ లో ఇది 52వ సెంచరీ కావడం విశేషం. సెంచరీ కొట్టిన ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక రికార్డ్ బ్రేక్ చేస్తూ దూసుకెళ్లే కోహ్లీ తన 52వ వన్డే సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అదేంటో కాదు ఒకే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు సాధించడం. క్రికెట్ లో ఇప్పటివరకు ఒకే ఫార్మాట్ లో 52 సెంచరీలు చేయడం కోహ్లీకి మాత్రమే చెల్లింది.
సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 51 సెంచరీలు చేస్తే.. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ వన్డేల్లో 51 సెంచరీలు చేశాడు. సఫారీలపై కోహ్లీ సెంచరీ కొట్టడంతో కోహ్లీ వన్డే సెంచరీల సంఖ్య 52కి చేరింది. దీంతో సింగిల్ ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా ఉన్న టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సెంచరీతో ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ లో ఇది 83వ సెంచరీ. 100 సెంచరీలతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ రికార్డ్ తో పాటు కోహ్లీ పలు రికార్డ్స్ బద్దలు కొట్టాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ రికార్డ్ తో పాటు వన్డేల్లో భారత్‌లో ఒకే వేదికపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే మూడు శతకాలు బాదిన బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు.
రాంచీలో ఐదు ఇన్నింగ్స్ ల్లో కోహ్లీకి ఇది మూడో సెంచరీ కాగా.. సచిన్ వడోదరలో ఏడు ఇన్నింగ్స్‌లో మూడుసార్లు 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. సౌతాఫ్రికాపై ఆరో సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్.. సఫారీలపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు సచిన్ టెండుల్కర్, డేవిడ్ వార్నర్ లతో 5 శతకాలతో సమంగా ఉన్న కోహ్లీ ఈ సెంచరీతో టాప్ కు చేరుకున్నాడు. వన్డేల్లో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై జట్టు విజయాల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు.
ఈ లిస్ట్ లో సచిన్ ను వెనక్కి కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. సచిన్ సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై 4363 పరుగులు చేస్తే కోహ్లీ 4483 పరుగులతో టాప్ లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో మరో రెండు వన్డేలు ఉన్న నేపథ్యంలో విరాట్ ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి.
తొలి వన్డేలో ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ:
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కష్టపడి గెలిచింది. ఆదివారం (నవంబర్ 30) రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ (120 బంతుల్లో 135: 11 ఫోర్లు, 7 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టిస్తే.. ఆ తర్వాత బౌలింగ్ లో కుల్దీప్, హర్షిత్ రానా అదరగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. మార్కో జాన్సెన్ (70), మాథ్యూ బ్రీట్జ్కే (72), కార్బిన్ బాష్ (67) సౌతాఫ్రికా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
