H-1B వీసాల్లో కీలక మార్పు: భారత ఐటీ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ!

H-1B వీసాల్లో కీలక మార్పు: భారత ఐటీ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ!

భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలకు అమెరికన్ మార్కెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా కంపెనీలు నియమించుకునేందుకు ఉపయోగించే కీలకమైన H-1B వీసా ఆమోదాల సంఖ్యలో ఈ ఏడాది భారీ పతనం నమోదైంది. ఇవి యూఎస్ వీసా విధానంలో కీలకమైన మార్పు జరుగుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

టాప్ 7 భారతీయ ఐటీ కంపెనీలకు 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగాల కోసం కేవలం 4వేల573 H-1B వీసాలకు మాత్రమే అప్రూవల్ పొందాయని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ విశ్లేషణ ప్రకారం వెల్లడైంది. వాస్తవానికి గడచిన దశాబ్ధకాలంలోనే ఇది అత్యంత తక్కువని చెప్పుకోవచ్చు. ఇది 2015తో పోలిస్తే ఏకంగా 70% పతనం, అలాగే 2024తో పోలిస్తే 37% తక్కువని తేలింది. అయితే H-1B వీసాల స్పాన్సర్‌ల జాబితాలో ఈసారి అగ్రస్థానంలో అమెరికన్ టెక్ కంపెనీలే కొనసాగాయి. చరిత్రలో తొలిసారిగా.. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు కొత్త H-1B ఆమోదాల్లో టాప్ నాలుగు స్థానాలను ఆక్రమించాయి. టాప్ 25 కంపెనీల జాబితాలో కేవలం మూడు భారతీయ సంస్థలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి.

దేశీయ ఐటీ దిగ్గజం TCS మాత్రమే కొంత పటిష్టతను చూపింది. కొత్త ఉద్యోగాల కోసం H-1B ఆమోదాలు పొందిన టాప్ 5 సంస్థల్లో టీసీఎస్ ఒక్కటే భారతీయ ఐటీ కంపెనీగా నిలిచింది. ఈ సంస్థకు కొత్త ఉద్యోగాల కోసం 846 ఆమోదాలు లభించాయి. ఇదే క్రమంలో కొత్త వీసాల తిరస్కరణ రేటులో 2 శాతంతో టీసీఎస్ అగ్రగామిగా నిలిచింది. అలాగే ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల వీసా పొడిగింపు ఆమోదాల్లో కూడా టీసీఎస్ టాప్-5లో ఉంది. పొడిగింపుల తిరస్కరణ రేటు కూడా టీసీఎస్‌కు 7%కి పెరిగింది.

కేవలం 'గ్రీన్ కార్డ్ క్యూ' కోసమే H-1B..?

అమెరికాలోకి కొత్త నిపుణులను తీసుకురావడం కంటే, కంపెనీలు తమ ఉన్న ఉద్యోగులను చట్టబద్ధంగా ఉంచడంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయని లా సంస్థ BTG అద్వాయకు చెందిన మన్సి సింగ్ అన్నారు. H-1B కార్యక్రమం ఇప్పుడు అమెరికాలో 'గ్రీన్ కార్డ్' కోసం ఎదురుచూసే వారికి కేవలం ఒక హోల్డింగ్ ప్యాటర్న్గా మారిందని చెప్పారు. 

H-1B వీసా దరఖాస్తుల్లో అత్యధికంగా ఉండే "సాఫ్ట్‌వేర్ ఇంజనీర్" కేటగిరీకి లేబర్ సర్టిఫికేషన్ ఆమోదాలు కూడా తగ్గాయి. 2022లో 40,378గా ఉన్న సర్టిఫికేషన్లు 2025 నాటికి 23,922కు పడిపోయాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అలాగే అమెరికాలో హెచ్1బి వీసా హోల్డర్లు సగటున లక్ష 35వేల డాలర్ల వరకు వేతనంగా అందుకుంటున్నారని అందువల్ల వీరిని చౌక శ్రామికులుగా పరిణించటం సరికాదని USCIS డేటా చెబుతోంది. మెుత్తానికి ట్రంప్ ఎంట్రీ తర్వాత మారిన తాజా పరిణామాలు భారతీయ ఐటీ కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని, అమెరికన్ టెక్ దిగ్గజాల పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి.