పాకిస్తాన్ మరోసారి అత్యంత ప్రమాదకరమైన రాజకీయ ప్రతిష్టంభనలో కూరుకుపోయింది. జనరల్ అసిమ్ మునీర్‌ను దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) గా అధికారికంగా నియమించే నోటిఫికేషన్ జారీలో ఆలస్యం ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. సాధారణంగా ఇది ఒక సాధారణ ప్రభుత్వ ప్రక్రియ కావాల్సి ఉండగా.. ప్రస్తుతానికి ఇది అపూర్వమైన ఉద్రిక్తతకు కేంద్ర బిందువుగా మారింది. ఈ కీలక సైనిక పత్రంపై సంతకం చేయాల్సిన ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆకస్మికంగా అదృశ్యం కావడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. మీడియా నివేదికల ప్రకారం ఈ ఆలస్యం కేవలం సాంకేతిక లోపం కాదని, పాకిస్తాన్ అధికార నిర్మాణంలో ఉన్న లోతైన సంక్షోభానికి సంకేతంగా తెలుస్తోంది.
దాయాది దేశంలో కొత్తగా సృష్టించబడిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) పదవి.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నియంత్రణను ఒకే గొడుగు కింద కేంద్రీకరిస్తుంది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత విస్తృతమైన అధికారాన్ని ఆసిమ్ మునీర్‌కు కట్టబెడుతుంది. మునీర్ ఇప్పటికే రెండింతల సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభించినప్పటికీ.. ప్రభుత్వం ఆయన నియామకాన్ని లాంఛనంగా ప్రకటించకపోవడంతో ఆయన “పరిపాలనా పరమైన సందిగ్ధత”లో ఉన్నారు.
►ALSO READ | ఎలన్ మస్క్ ఫ్యామిలీ సీక్రెట్స్ : నా భార్య సగం ఇండియా.. నా కొడుకు పేరులో శేఖర్ ఉంది..
అసిమ్ మునీర్ చీఫ్ అవునా కాదా అనే విషయం సైన్యానికి కూడా ఖచ్చితంగా తెలియదని మాజీ NSAB సభ్యుడు తిలక్ దేవషేర్ చెప్పారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావాలనే CDF నోటిఫికేషన్ జారీ చేయకుండా తప్పించుకుంటున్నారని దేవషేర్ వ్యాఖ్యానించారు. అయితే షెహబాజ్ షరీఫ్ నోటిఫికేషన్‌కు ముందు ఇస్లామాబాద్ నుంచి “అదృశ్యం” కావడంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మునీర్ కి అధికారం కట్టబెట్టడం ప్రధాని షరీఫ్ కి ఇష్టం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
షెహబాజ్ వెనుకడుగు వేయడానికి బలమైన కారణం ఉంది. CDF పదవి సైనిక పరిపాలనను సమూలంగా మారుస్తుంది. భవిష్యత్తులో పౌర పర్యవేక్షణను నియంత్రిస్తుంది. ఈ నోటిఫికేషన్‌పై సంతకం చేస్తే, సైన్యం దీర్ఘకాలిక ఆధిపత్యాన్ని షెహబాజ్ తన చేతుల్తో సుస్థిరం చేసినట్లవుతుంది. ఇప్పటికే పరిమిత అధికారం ఉన్న షెహబాజ్.. ఈ ఉచ్చు గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలస్యం ఇప్పటికే “ప్రధాన సైనిక నాయకత్వ సంక్షోభానికి” దారితీసింది. అక్కడి ప్రజలు కూడా భవిష్యత్తులో తాము సైనిక పాలనలోకి జారుకుంటామని ఆందోళన చెందుతున్నారు. మునీర్ దూకుడు స్వభావం కారణంగా షరీఫ్ సంతకం చేస్తే కేవలం ఒక తూతూమంత్రపు పాలకుడిగా మారే ప్రమాదం కూడా ఉంది. మునీర్ సైన్యాన్ని కూడా రెచ్చగొట్టొచ్చని భయాలు పెరుగుతున్నాయి పాకిస్థాన్ లో.
