అమెరికాపై మిత్ర దేశాల గుస్సా..ట్రంప్ తీరుపై మండిపడిన యూరప్ నేతలు

అమెరికాపై  మిత్ర దేశాల గుస్సా..ట్రంప్ తీరుపై  మండిపడిన యూరప్ నేతలు
  • ఆ దేశంతో కలిసి నడిచే రోజులు పోయాయి: కెనడా ప్రధాని కార్నీ  
  • ప్రపంచ భౌగోళిక రాజకీయం, ఆర్థిక రంగాలను ట్రంప్ తలకిందులు చేశారు 
  • అమెరికా ఆధిపత్యంతో ప్రపంచం విచ్ఛిన్నమవుతోందని ఫైర్ 
  • ఇష్టారీతిన టారిఫ్​లంటే ఒప్పుకోం: ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్ 
  • ట్రంప్ అడిషనల్ టారిఫ్​లు తప్పిదం: ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా
  • అమెరికాతో ట్రేడ్​ డీల్​కు ఈయూ పార్లమెంట్​ బ్రేక్​

దావోస్(స్విట్జర్లాండ్):  గ్రీన్​లాండ్​ను స్వాధీనం చేసుకుంటామని, సహకరించని దేశాలపై టారిఫ్​లు వేస్తామన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ లోని మిత్ర దేశాలు గుస్సా అయ్యాయి. స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వేదికగా ట్రంప్ తీరుపై ఆయా దేశాల అధినేతలు మండిపడ్డారు. 

అమెరికా ఆధిపత్యం కారణంగా ప్రపంచం విచ్ఛిన్నం అవుతోందని, ఇక ఆ దేశంతో కలిసి నడిచే రోజులు పోయాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. అమెరికా కొత్త వలసవాద సామ్రాజ్య విధానాన్ని అనుసరిస్తోందని, దీనివల్ల దశాబ్దాల నాటి భాగస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్ హెచ్చరించారు. ముందుగా డబ్ల్యూఈఎఫ్ వేదికగా కాలిఫోర్నియా గవర్నర్, డెమోక్రటిక్ నేత గవిన్ న్యూసోమ్ మంగళవారం యూరోపియన్ నేతలు నైతికంగా దిగజారడం ఆపాలని, సీరియస్ నెస్ తో ఉండాలని చేసిన కామెంట్లు దుమారం రేపాయి.

 ‘‘ఈ నైతిక దిగజారుడుతనాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. వాళ్లు తమ వైఖరిని అటూఇటూ మార్చుకోవడం ఆపాలి. వెన్నెముకను నిటారుగా పెట్టుకుని నిలబడాలి. అందుకే వాళ్ల కోసం నేను ప్రత్యేకంగా మోకాలికి పటుత్వం కోసం పెట్టుకునే ప్యాడ్స్ తీసుకొచ్చాను” అని గవిన్ అన్నారు. ప్రపంచ వేదికపై వాళ్లు ఎంత దయనీయంగా కనిపిస్తున్నారో చూస్తే విస్మయం కలుగుతోంది. ట్రంప్ తో దౌత్యమా? ఆయన టీరెక్స్ (డైనోసార్)లాంటి వారు. ఆయనతో మీరు జతకట్టాల్సిందే. లేకపోతే మిమ్మల్ని మింగేస్తారు” అని వ్యాఖ్యానించారు. దీంతో గవిన్ వ్యాఖ్యలపైనా యూరప్ నేతలు తీవ్రంగా స్పందించారు.  

ఆ దేశాలు ఏంకావాలంటే అది చేస్తున్నయ్: కార్నీ 

శక్తిమంతమైన దేశాలు ఏం కావాలంటే అది చేస్తున్నాయని, బలహీనమైన దేశాలు మాత్రం నష్టపోతున్నాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడుతూ రావడం వల్ల తాము ఎంతో నష్టపోయామన్నారు. ఇకపై ఈ పద్ధతిని మార్చుకుని, దేశీయంగా బలోపేతం అవుతామన్నారు. ‘‘పెద్ద దేశాలు సొంతంగా నెట్టుకురాగలుగుతున్నాయి. వాళ్లకు పెద్ద మార్కెట్ ఉంది. మిలిటరీ సత్తా ఉంది. రూల్స్ ను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. కానీ మధ్యస్థాయి దేశాలు అలా లేవు. 

అందుకే మధ్య స్థాయి దేశాలన్నీ ఏకం కావాలి. కలిసికట్టుగా చర్చలకు వెళ్లి సాధించుకోవాలి. లేదంటే అన్నీ నష్టపోతాయి” అని ఆయన పిలుపునిచ్చారు. బలమైన దేశాలతో ఉన్నంత మాత్రాన భద్రత లభించదని, ఇకపై ఆ దేశాలతో కలిసి నడిచే రోజులు పోయాయన్నారు. గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలను కార్నీ తీవ్రంగా వ్యతిరేకించారు.  ప్రపంచ భౌగోళిక రాజకీయం, ఆర్థిక రంగాలను ట్రంప్ తలకిందులు చేశాడని ఫైర్ అయ్యారు. 

అమెరికా ఆధిపత్యంతో ప్రపంచం విచ్ఛిన్నం అవుతోందన్నారు. గ్రీన్ లాండ్, డెన్మార్క్ కు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, గ్రీన్ లాండ్ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఆ ప్రాంతానికి మాత్రమే ఉందన్నారు. ‘‘మనం టేబుల్ వద్ద ప్రతినిధులుగా ఉండాలి. లేదంటే మనమే టేబుల్ పై మెనూలా మారిపోతాం”అని హెచ్చరించారు. కాగా, కార్నీ ప్రసంగానికి ప్రపంచ నేతలు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. 

యూరప్ బలోపేతం కావాలి: మాక్రన్ 

ప్రపంచం రూల్స్ లేకుండా అస్తవ్యస్తంగా తయారైందని, బలవంతులు చేసిందే చట్టం అన్నట్టుగా మారుతోందని.. అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్ మండిపడ్డారు. శక్తిమంతమైన దేశాలు ఏదనుకుంటే అదే చట్టమనేలా పరిస్థితి ఉందని, మళ్లీ సామ్రాజ్యవాద ప్రయత్నాలు తెరపైకి వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ట్రంప్ సర్కారు ట్రేడ్ అగ్రిమెంట్లను అడ్డం పెట్టుకుని తమ ఎగుమతి ప్రయోజనాలను దెబ్బ తీస్తోందన్నారు. 

ఇష్టారీతిలో టారిఫ్ లు వేస్తూ పోవడం తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. యూరప్ ఇకపై మరింత బలోపేతం కావాలన్నారు. కాగా, గ్రీన్ లాండ్ విషయంలో ట్రంప్ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తున్నారని, ఇప్పటికే ఆయన యూరప్ లో అనేక రెడ్ లైన్ లు దాటేశారని బెల్జియం ప్రధాని బార్ట్ డీ వీవర్ అన్నారు. ‘‘సంతోషంగా ఉండే సామంతులుగా ఉండటమా? లేదంటే దు:ఖంలో కూరుకుపోయే బానిసలా ఉండటమా? ఏదో ఒకటి తేల్చుకోవాలి. మీరు మోకరిల్లితే గౌరవాన్ని కోల్పోతారు”అని యూరప్ దేశాలను హెచ్చరించారు. అలాగే, కూటమిగా కొనసాగాలా? వద్దా? అనేది ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉందన్నారు.

అడిషనల్ టారిఫ్​లు తప్పిదం: ఉర్సులా 

దీర్ఘకాలికంగా మిత్ర దేశాలుగా ఉన్న యూరప్ కంట్రీస్ పై ట్రంప్ అదనపు టారిఫ్ లు వేస్తాననడం తీవ్ర తప్పిదమని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అన్నారు. ఇది దౌత్యపరంగా ప్రతికూల అంశంగా మారుతుందని, తద్వారా వ్యతిరేకత పెరిగేందుకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులు యూరప్ భద్రత, విలువలు, సుసంపన్నతకు సవాలు అని అన్నారు. ప్రస్తుతం ఈయూ చౌరస్తాలో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు. 

అమెరికా, ఈయూ గత జులైలో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నాయని, వాటికి కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. కాగా, యూరోపియన్లు బుజ్జగింపులకు లొంగిపోరాదని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ అన్నారు. దావోస్ సదస్సు సందర్భంగా ఆయన ఈ మేరకు ‘ఎక్స్’లో యూరప్ దేశాలకు సందేశం పంపారు. ‘‘బుజ్జగింపులు బలహీనతకు సంకేతాలు. శత్రువులే కాదు మిత్రుల విషయంలోనూ యూరప్ బలహీనంగా ఉండరాదు. బుజ్జగింపులు అంటే ఫలితాలుండవు. అవమానాలే ఉంటాయి. యూరప్ దృఢంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడాల్సిన​అవసరం ఉంది” అని పిలుపునిచ్చారు.