- మీ దేశాన్ని భూస్థాపితం చేయాలని మావాళ్లను ఆదేశించా
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పాలనకు చరమగీతం పాడాలని ట్రంప్ పిలుపునివ్వగా.. తమ లీడర్‌పై ఏదైనా దాడి జరిగితే చూస్తూ ఊరుకోబోమని, ప్రతిదాడి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్‌పై ట్రంప్ మళ్లీ తీవ్రంగా స్పందించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
న్యూస్ నేషన్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ హెచ్చరికలపై ట్రంప్ స్పందిస్తూ.. ‘‘మీరు నన్ను చంపేస్తే, ఈ భూమ్మీదే ఉండరు. నాపై హత్యాయత్నం జరిగినా, నన్ను చంపేసినా.. దాని వెనకున్నది ఇరాన్ అని తేలితే ఆ దేశాన్ని సమూలంగా తుడిచిపెట్టేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించా’’ అని తెలిపారు. ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ అబోల్ఫాజల్ షెకార్చి వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్లు చేశారు.
ఇరాన్ ఏమన్నదంటే?
ఇరాన్‌లో ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ ఆందోళనలను అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ఆందోళనకారులకు మద్దతు పలికారు. ఇరాన్‌లో ఖమేనీ పాలన అంతం కావాలని, కొత్త నాయకత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నారు. దీంతో ట్రంప్‌పై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలో నిరసనలకు ఆయనే కారణమని ఆరోపించింది.
ఈ క్రమంలో ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ అబోల్ఫాజల్ షెకార్చి స్పందిస్తూ.. ‘‘మా సుప్రీం లీడర్‌పై దాడి చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, మేం ఆ చేతులను నరికివేస్తాం. అంతేకాకుండా వాళ్ల ప్రపంచానికే నిప్పు పెడతాం.. వాళ్లకు ఈ భూమ్మీద సురక్షితమైన ప్రాంతమనేదే లేకుండా చేస్తాం. ఈ విషయం ట్రంప్‌కు కూడా తెలుసు. మా హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కావు.. చేసి చూపిస్తాం”అని హెచ్చరించారు. దీనికి బదులుగానే ట్రంప్ తాజా కామెంట్లు చేశారు. కాగా, ఇరాన్ నిరసనల్లో చనిపోయినోళ్ల సంఖ్య 4,500 దాటిందని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
