సైబర్ క్రైమ్ నియంత్రణకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ లలో డీఫాల్ట్ యాప్ ను ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి తయారయ్యే ప్రతి కొత్త ఫోన్ లో డీఫాల్ట్ గా యాప్ ఇన్ స్టాల్ అయ్యి ఉండాలని మొబైల్ ఫోన్ కంపెనీలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసిన సంచార్ సాథీ యాప్.. ఇక నుంచి అన్ని ఫోన్లలో ఉండేలా చూడాలని అధికార యంత్రాంగాన్ని డిసెంబర్ 01న ఆదేశించింది.
సైబర్ నేరాలను నిరోధించే ఉద్దేశంతో ఈ సంచార్ సాథీ యాప్ ను డెవలప్ చేశారు. స్కామ్ కాల్స్ ను గుర్తించడం, మోసపూరిత మెసేజ్ లపై రిపోర్ట్ చేయడం, దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చేయడం లేదా బ్లాక్ చేయడం ఈ యాప్ ద్వారా చేయవచ్చు. కొత్త ఫోన్లతో పాటు పాత ఫోన్లలో కూడా యాప్ ఉండేలా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాలని ఫోన్ల తయారీ కంపెనీలకు సూచించింది. ఈ యాప్ డీఫాల్ట్ గా ఫోన్ తో పాటే వస్తుంది.. డిలీట్ చేయడం కూడా కుదరదు.
ఫోన్లో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ వినియోగించేవాళ్లు సిమ్ కార్డుకు లింక్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే ఆ కంపెనీలను ఆదేశించింది కేంద్ర కమ్యూనికేషన్స్ విభాగం (DoT). ఫోన్ లో సిమ్ లేకుండా ఈ యాప్స్ వినియోగించడం కుదరదు. ఒకవేళ సిమ్ లేకుంటే వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ ఆరు గంటల్లో లాగౌట్ అయిపోతాయి. వాట్సాప్ వెబ్ కూడా లాగ్ అవుట్ అయిపోతుంది. సైబర్ క్రైమ్ నియంత్రణలో భాగంగా వాట్సాప్ లాంటి కంపెనీలకు ఈ కీలక మార్పులు సూచించిన DoT.. ప్రస్తుతం సంచార్ సాథీ యాప్ ఉండేలా చూడాలని మొబైల్ తయారీ కంపెనీలకు సూచించడం విశేషం.
కొత్త మొబైల్స్ లో సంచార్ సాథీ యాప్ డీఫాల్ట్ గా ఉండేలా చూసేందుకు కంపెనీలకు మూడు నెలల గడువు ఇచ్చింది కేంద్రం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యాపిల్, సామ్ సంగ్, షావోమీ,ఒప్పో,వివో తదితర అన్ని ఫోన్లకు ఈ రూల్ వర్తిస్తుంది. ఇప్పటి వరకు తయారు చేసిన ఫోన్లలో కూడా యాప్ ఉండేలా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాల్సిందిగా కంపెనీలకు సూచించింది.
