
- ఏండ్లకేండ్లు ఎదురుచూస్తున్నా అందని సాయం
- తలదాచుకునే చోటు లేక, చేసేందుకు పని లేక అరిగోస
- ఎక్కడికక్కడ రిలే దీక్షలు, ధర్నాలు.. న్యాయ పోరాటాలు
- కాళేశ్వరం నుంచి పాలమూరు దాకా ఇదే పరిస్థితి
వెలుగు నెట్వర్క్: ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం వందల ఊర్లను, లక్ష ఎకరాలకు పైగా భూములను సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను మాత్రం పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం నుంచి పాలమూరు ప్రాజెక్టు వరకు ఇండ్లు, జాగలు కోల్పోయిన వాళ్లకు ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి పరిహారం ఇవ్వడం లేదు. దీంతో నిర్వాసితులు సర్కారుపై మర్లవడుతున్నారు. న్యాయమైన పరిహారం కోసం కొందరు కోర్టులకు వెళ్తుంటే.. మరికొందరు ముంపు గ్రామాల్లో రిలే దీక్షలు చేస్తున్నారు. ఇంకొందరు ప్రాజెక్టు పనులను అడ్డుకొని ధర్నాలకు దిగుతున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కనీసం పునరావాసం కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరతరాల నుంచి తమను అక్కున చేర్చుకున్న అమ్మలాంటి ఊర్లు ప్రాజెక్టుల్లో మునగడంతో దిక్కులేని పక్షులమయ్యామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తలదాచుకునేందుకు చోటు లేక, చేసుకునేందుకు పనులు లేక అరిగోస పడుతున్నామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వాసితులతో కూర్చొని మాట్లాడి, వాళ్ల డిమాండ్లను మానవీయ కోణంలో పరిష్కరించాల్సిన ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. పోలీసులను పెట్టి మరీ పనులు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆయా ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్ర సర్కారు ఎక్కడా నిర్వాసితులకు మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వడం లేదు. నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం 20, 21, 22 ప్యాకేజీ పనుల కింద 3 వేల ఎకరాలు సేకరించింది. ఇక్కడ మార్కెట్ రేటు ఎకరానికి రూ. 30 లక్షల నుంచి 50 లక్షలు ఉండగా, ప్రభుత్వం మాత్రం రూ. 4 లక్షలు చెల్లిస్తామంటున్నది. దీంతో 800 మంది రైతులు తరుచూ ఆందోళనకు దిగి పనులు అడ్డుకుంటున్నారు.
మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లో 9 గ్రామాల నుంచి దాదాపు 13 వేల పట్టా భూములను సేకరించారు. ఈ ఊర్లలో ఎకరా రూ. 20 లక్షలకు పైగా పలుకుతున్నది. కానీ సర్కారు రూ. 6 లక్షలకు మించి పరిహారం ఇవ్వలేదు. వెయ్యి మందికి పైగా నిర్వాసితులు కోర్టుల్లో పోరాడుతున్నారు.
ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కాల్వల కోసం దాదాపు 1,700 ఎకరాలు సేకరించారు. నేటికీ పరిహారం అందకపోవడంతో ఇటీవల తిరుమలాయపాలెం మండల రైతులు ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మసాగర్ బ్యారేజీ కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సర్కారు ఎకరానికి8 లక్షల పరిహారం ప్రకటించింది. దీనికి ఒప్పుకోని రైతులు 150 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్లు అంటే 32 లక్షల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎల్లంపల్లి కింద జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో సేకరించిన భూములకు సంబంధించి 700 కుటుంబాలకు నేటికీ పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం అందించలేదు. దీంతో 14 ఏండ్లుగా బాధితులు పరిహారం కోసం ఆఫీసర్లు, లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే మండలంలో కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ కెనాల్పనులు చేపట్టి ఏడాది గడిచినా జగదేవ్పేట్, కొండాపూర్ గ్రామాల్లో 171 ఎకరాలకు సంబంధించి 78 మందికి పరిహారం అందలేదు. గొల్లపల్లి మండలంలోని దమ్మన్న పేట్, ఛందోలి.. పెగడపల్లి మండలం నామపూర్లోనూ పరిహారం అందక నిరసన తెలుపుతున్నారు.
పాలమూరు–రంగారెడ్డి లిఫ్టు స్కీంలో భాగంగా నాలుగు రిజర్వాయర్లు, కెనాల్స్ కోసం ఇప్పటివరకు 19 వేల ఎకరాల భూమి సేకరించగా, 23 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఇండ్లు, భూములు సేకరించిన సర్కారు ఇప్పటికి సగం మంది రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. డిండి లిఫ్ట్ స్కీం కింద అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, చారకొండ.. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్డండ, ఆమనగల్లు మండలాల్లో 1100 ఎకరాలు సేకరించారు. కానీ ఏ ఒక్క రైతుకూ పరిహారం అందలేదు. వట్టెం రిజర్వాయర్ కింద భూములు పోతున్న వట్టెం, కారుకొండ గ్రామాల్లో ఎకరాకు రూ. 5 లక్షల 50 వేలు ఫిక్స్ చేశారు. సుమారు 51 మంది రైతులు పరిహారం చెల్లించాలని న్యాయపోరాటం చేస్తున్నారు.
తలదాచుకునే చోటు లేక..
ప్రాజెక్టులను పూర్తిచేసి నీళ్లతో నింపుతున్నా పునరావాస పనుల జాడలేకపోవడంతో నిర్వాసితులు ఉన్న ఊర్లు వదిలి ఎక్కడెక్కడో ఉంటున్నారు. తలదాచుకునే చోటు లేక ఆగమవుతున్నారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్టు స్కీం కింద వనపర్తి జిల్లాలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయినా రేవల్లి మండలంలోని బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామాల్లో నేటికీ పూర్తిస్థాయిలో పరిహారాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. తమకు వెంటనే పరిహారం ఇచ్చి, పునరావాసం కల్పించాలనే డిమాండ్‌తో కొంకలపల్లిలో 115 మంది నిర్వాసితులు 10 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. బండ రావిపాకులలో 390 ఫ్యామిలీలకు ఇంకా ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. ఇదే జిల్లాలో భీమా లిఫ్టు స్కీం కింద శంకరసముద్రం రిజర్వాయర్ లో కానాయపల్లి, రంగసముద్రం రిజర్వాయర్ లో నాగరాల గ్రామం ముంపుకు గురవుతున్నాయి. సుమారు రెండు వేల కుటుంబాలు ఆశ్రయం కోల్పోగా, ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. నల్గొండ జిల్లాలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణం లో నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండావాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇండ్ల నిర్మాణం పెండింగ్‌లో ఉంది. 1,500 ఫ్యామిలీలకు చింతపల్లి మండలంలో ఇండ్లు నిర్మిస్తామని ఆఫీసర్లు చెప్పారు. కానీ ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వక పోవడంతో 2015 నుంచి ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం 45 రోజుల నుంచి నర్సిరెడ్డిగూడెం ప్రజలు దీక్ష చేస్తున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న 5,500 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటివరకు 2,500 కుటుంబాలకు మాత్రమే గజ్వేల్ సమీపంలోని ముట్రాజ్‌పల్లి వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇండ్లు కేటాయించారు. మరో 3 వేల కుటుంబాలకు ఇండ్ల స్థలాలు ఇవ్వనేలేదు. కొండపోచమ్మసాగర్ నిర్వాసితులకు తునికి బొల్లారంలో ఆర్ అండ్ ఆర్ కాలనీని నిర్మించినా కనీస వసతులు కల్పించలేదు. ఈ ఇండ్లు వద్దన్నవారికి ప్రత్యేకంగా 250 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదు. యాదాద్రి జిల్లాలో కాళేశ్వరం 16వ ప్యాకేజీ కింద నిర్మిస్తున్న బస్వాపూర్ (నృసింహ) రిజర్వాయర్కింద 1556 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రోగ్రెస్ లేదు.
18 ఏండ్లు నిండినోళ్లకూ ఎదురుచూపులే..
కొన్ని గ్రామాల్లో ఇండ్లు, భూములకు పరిహారం ఇస్తున్నా ఇతరత్రా పరిహారాలు ఆపుతున్నారు. 18 ఏండ్లు నిండిన యువతీయువకులు, ఒంటరి మహిళలకు ఇవ్వాల్సిన ప్రత్యేక పరిహారాలు ఇయ్యట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మన్వాడ వద్ద మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తయి మూడేండ్లు గడుస్తున్నా యువతీయువకులు పరిహారం అందడం లేదు. 2015 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీయువకులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. 800 మంది యువతులకు ఇంకా అందలేదు. ఇందుకు సంబంధించిన ఫైలు గత రెండేండ్లుగా కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉంది.
సీఎం సొంత జిల్లా సిద్దిపేటలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ కింద తొగుట, కొండపాక మండలాల్లోని తొమ్మిది గ్రామాల్లో నేటికీ స్ట్రక్చర్ వాల్యూస్, ఖాళీ స్థలాలు, చెట్లు, బోర్లు, బావులకు సంబంధించి పరిహారాలు పెండింగ్పెట్టారు. ఒంటరి మహిళకు ప్యాకేజీ ఇయ్యకపోవడంతో మంగారి బాలవ్వ అనే వృద్ధురాలు ఇటీవల సూసైడ్ చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ కింద మర్కుక్ మండలంలోని మామిడ్యాల, బైలంపూర్, తానేదార్ పల్లి గ్రామాల్లో ఇప్పటికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు, 18 ఏండ్లు నిండిన వారికి ఐదు లక్షల పరిహారం, ఒంటరి మహిళల ప్యాకేజీలు ఇవ్వలేదు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి, దాని పరిధిలోని తండా వాసులకు పదేండ్లుగా స్ట్రక్చర్ వాల్యూస్, ఖాళీ జాగల పరిహారాలు, ఆర్ అండ్ ఆర్, 18 ఏండ్లు నిండిన వారికి ప్యాకేజీ అందలేదు. ప్రాజెక్టు గెజిట్ నోటిఫికేషన్ వెలువడినప్పుడు 111 మందికి పరిహారాలు మిస్సయ్యాయి. పెండింగ్ పరిహారాలు చెల్లించకుండా 2 రోజుల కింద గౌరవెల్లి ప్రాజెక్టు తుది దశ పనులకు ఆఫీసర్లు రావడంతో గుడాటిపల్లి నిర్వాసితులు అడ్డుతగిలారు.
సర్వే చేసిన రోజు ఊర్లో లేరని..!
సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుడాటిపల్లికి చెందిన ఈ మహిళ పేరు కంప లక్ష్మి. ప్రాజెక్టు కింద గ్రామంలోని ఆమె ఇంటిని, రెండెకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం సోషల్సర్వే నిర్వహించిన రోజు లక్ష్మి కుటుంబం గ్రామంలో లేకపోవడంతో.. లోకల్‌గా నివాసం ఉండట్లేదని ఆఫీసర్లు రికార్డు చేశారు. దీంతో లక్ష్మి కుటుంబం ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి దూరమైంది. ఐదేండ్లుగా లక్ష్మి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. కానీ గెజిట్ లో ఆమె పేరు లేక పోవడంతో 18 ఏండ్లు నిండిన ఆమె కొడుకు, కూతురికి కూడా ప్యాకేజీ అందడం లేదు. ఈ ఒక్క గ్రామంలోనే మరో 52 కుటుంబాలు ఇదే సమస్య ఎదుర్కొంటున్నాయి.
ప్రాణాలు పోతున్నయి
మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లోని 8 గ్రామాలు మునుగుతుండగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రాలేదనే బాధతో వేములఘాట్ గ్రామానికి చెందిన మంగారి బాలవ్వ(80) ‘ఒంటరి మహిళ ప్యాకేజీ’ అందక గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని నివాసంలో సూసైడ్ చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోని గుడాటిపల్లిలో పరిహారం రాకపోవడంతో ఎల్లయ్య, బద్దం రాజు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో వట్టెం రిజర్వాయర్ కింద భూములు పోతున్న వట్టెం, కారుకొండ గ్రామాలకు చెందిన 51 మంది రైతులు కోర్టులో పోరాటం చేస్తున్నారు. కోర్టు పరిహారం పెంచి ఇయ్యాలని చెప్పినా ఇవ్వకపోవడంతో ఎదురుచూసి 8 మంది గుండెపోటుతో చనిపోయారు. డిండి లిఫ్ట్ స్కీం కింద అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు,చారకొండ, కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్డండ, ఆమనగల్లు మండలాల్లో 1,100 ఎకరాలు సేకరించారు. పరిహారం రాక ఉమాపూర్కు చెందిన దళిత రైతు బుచ్చయ్య, డిండిచింతపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుపతిరెడ్డి భార్య గుండెపోటుతో చనిపోయారు. యాదాద్రి జిల్లాలోని బస్వాపురం నృసింహ రిజర్వాయర్ కింద కోల్పోతున్న భూమికి పరిహారం రావడం లేదన్న ఆవేదనతో బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన పిన్నం సతీశ్ (39) ఈ ఏడాది ఏప్రిల్ 11న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మే 5న చనిపోయాడు.
చితి పేర్చుకొని ఆత్మాహుతి
మల్లన్న సాగర్ ముంపు గ్రామం తొగుట మండలం వేములఘాట్ కు చెందిన తూటుకూరి మల్లారెడ్డి(75)కి భార్య , ముగ్గురు కూతుర్లు. ఆయనకు చెందిన 2.14 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 500 గజాల ఇంటిని ప్రభుత్వం తీసుకుంది. పరిహారంతో పాటు గజ్వేల్ వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇల్లు ఇస్తామని అధికారులు మొదట హామీ ఇచ్చారు. మల్లారెడ్డి పిడిచేడ్ గ్రామంలో చిన్న కూతురుతో కలిసి అద్దె ఇంట్లో ఉంటుండగా.. భార్య చనిపోయినందున ఇల్లు రాదని అధికారులు చెప్పారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన జూన్ 17న అర్ధరాత్రి వేములఘాట్లోని తన పాత ఇంట్లో కట్టెలను చితిగా పేర్చుకుని నిప్పంటించుకుని ప్రాణాలు విడిచాడు.
ఎములాడ రాజన్న సాక్షిగా మాటిచ్చి మరిచిన కేసీఆర్
మిడ్‌మానేరులో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల చొప్పున అందజేస్తానని సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న సాక్షిగా ప్రకటించి యాది మరిచారు. ఆయన ఇచ్చిన హామీ అమలు కోసం నిర్వాసితులు పలుమార్లు ఆందోళన చేశారు. సీఎం అత్తగారి ఊరు, ముంపు గ్రామాల్లో ఒకటైన కొదురుపాకలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. మరో ముంపు గ్రామమైన నీలోజిపల్లి నుంచి కలెక్టరేట్ వరకు మహా పాదయాత్ర తీసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.