మళ్లీ అప్పుల వేట మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

మళ్లీ అప్పుల వేట మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

గ్యారంటీ లోన్లు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ యోచన 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ మళ్లీ అప్పుల వేట మొదలుపెట్టింది. ఉన్న స్కీమ్ లను కొనసాగించడం, కొత్త స్కీమ్ లను ప్రారంభించేందుకు అప్పులు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వస్తున్న ఆదాయమంతా జీతాలు, రెగ్యులర్ స్కీమ్​లు, ఇంతకుముందు తెచ్చిన అప్పుల వడ్డీలు, కిస్తీలకు పోతోంది. దీంతో కొత్తగా ప్రకటించిన భారీ పథకాలకు ఫండ్స్ లేక ప్రారంభించడం లేదు. వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇప్పటికే ప్రకటించిన స్కీమ్​లను ప్రారంభించాలని, అందుకు అప్పులు ఎలా చేయాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టింది. డిసెంబర్ నెలాఖరుకు కనీసం రూ.18 వేల కోట్లు సేకరించాలని అనుకుంటోంది. గ్యారంటీ అప్పులు తెచ్చి, వాటిని స్కీమ్ లకు బదలాయించాలని భావిస్తోంది. 

ఆ మూడు స్కీమ్​లకే..  

సర్కార్ ఈసారి బడ్జెట్​లో దళిత బంధు, సొంత జాగా ఉన్నోళ్లకు రూ.3 లక్షలు ఆర్థిక సాయం స్కీమ్​కు భారీగా నిధులు కేటాయించింది. దళిత బంధుకు వెంటనే రూ.5,900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక సాయం స్కీమ్ కింద రూ.10 వేల కోట్లు బడ్జెట్​లో కేటాయించగా, ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. ఇందులో సగమైనా ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక రైతు బంధుకు బడ్జెట్​లో ఎప్పటిలాగే రూ.15 వేల కోట్లు కేటాయించిన సర్కార్.. ఇందులో ఖరీఫ్​లో సగం పంపిణీ చేసింది.

యాసంగికి డిసెంబర్​లో రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. దీంతో అప్పులు చేసైనా సరే స్కీములు మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో నాలుగు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. డిసెంబర్ లోనే ఈ స్కీములకు నిధులిస్తే పథకం మొదలైన భావన వస్తుందని ప్రభుత్వం అనుకుంటోంది. ఆ తర్వాత మొత్తం ఎలక్షన్​మూడ్ ​ఉంటుందని, అప్పుడు ఎలాంటి సమస్య ఉండదని భావిస్తోంది. 

ఆదాయం పెరిగినా ఫాయిదా లేదు.. 

వివిధ రూపాల్లో ప్రజలపై రాష్ట్ర సర్కార్​పన్నుల భారం మోపింది. రిజిస్ర్టేషన్లు, ఎక్సైజ్ ట్యాక్సులు, ట్రాన్స్​పోర్టులో బండ్లపై లైఫ్‌‌‌‌ ట్యాక్స్ మోత మోగించగా, ఇప్పుడు గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌, క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌ వేసింది. జీఎస్టీ కూడా పెరిగింది. దీంతో సొంత రాబడి పెరిగింది. ఇలా సెప్టెంబర్​నాటికి రాష్ట్ర సర్కార్​కు సొంత ఆదాయం రూ.50  వేల కోట్ల దాకా వచ్చింది. మొత్తం ఆదాయ అంచనా రూ.1.26 లక్షల కోట్లు కాగా, ఇది దాదాపు వంద శాతం వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. అయినా కూడా ముఖ్యమైన స్కీములు అమలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆసరా, కల్యాణ లక్ష్మీ, జీతాలు తదితరాలకే ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయి. దీంతో భూముల అమ్మకం, అప్పులనే సర్కార్​ నమ్ముకుంది.

కార్పొరేషన్ల కింద తీసుకోవాలని... 

రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రతినెలా బాండ్ల వేలంలో ప్రభుత్వం అప్పులు తీసుకుంటోంది. ఈ నెల రూ.3 వేల కోట్లు, డిసెంబర్​లో రూ.2,078 కోట్లు అందనుంది. అయితే ప్రతినెలా చేస్తున్న అప్పు ఆయా అవసరాలకే సరిపోతోంది. పాత అప్పుల వడ్డీలకే నెలకు రూ.1,800 కోట్లు పోతోంది. ఇది కాకుండా కిస్తీలకు మరో రూ.3 వేల కోట్ల దాకా అవసరం పడుతోంది. దీంతో డిసెంబర్​లో వచ్చే రూ.2 వేల కోట్ల అప్పు దేనికీ సరిపోదు. మరోవైపు భూముల అమ్మకంతో వచ్చే నిధులు టైమ్​కు అందుతాయో? లేదో? అన్న అనుమానం ఉంది. ఈ క్రమంలో వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీల ద్వారా అప్పులు తీసుకొని, వాటిని ఖజానాకు మళ్లించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే గ్యారంటీ అప్పులకూ ఆర్​బీఐ నుంచి కఠిన నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుకూలంగా మార్చుకొని అప్పు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.