నష్టపరిహారం ఇస్తలె.. చెరువులు బాగు చేస్తలె

నష్టపరిహారం ఇస్తలె.. చెరువులు బాగు చేస్తలె
  • గతేడాది వరదలతో తెగిపోయిన చెరువుల కట్టలు
  • నష్టపోయిన రైతులను కూడా ఆదుకొని ప్రభుత్వం 
  • రిపేర్ల ఎస్టిమేషన్​ ఇచ్చినా అప్రూవల్ రాలేదంటున్న అధికారులు
  • సిటీ శివారు పరిధిలోని చెరువులు కింద వరద బాధితుల పరిస్థితి ఇది

ఎల్​ బీనగర్, వెలుగు: దెబ్బతిన్న చెరువులు, కుంటలపై ప్రభుత్వానిది, అధికారులది హడావుడినే తప్ప శాశ్వత మరమ్మతులు చేసే పరిస్థితి  కనిపించడం లేదు.  గతేడాది అక్టోబర్​లో వర్షాలు, వరదలతో సిటీ శివారులోని గ్రామాల్లో చెరువులు, కుంటల కట్టలు తెగిపోయి వరద ఎఫెక్ట్​తో ఇండ్లు కూలిపోయి, పంటలు నష్టపోయినా బాధితులను సర్కార్ పట్టించుకోవడంలేదు.  నష్టంపై అధికారులు ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్​ఇచ్చినా పక్కన పడేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం సెగ్మెంట్లలో సుమారు 30 నుంచి 40 చెరువులు ధ్వంసమయ్యాయి. ఒక్కో చెరువుకు రూ.7 లక్షల నుంచి రూ .కోటిన్నర వరకు మరమ్మతు కోసం అధికారులు అంచనా వేసి రిపోర్ట్​ను ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. చెరువులు మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. దీంతో చెరువులపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు మరమ్మతులు చేయించాలని అధికారులను కోరుతున్నారు.  మూడు నెలల కిందట ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ డీఈకి  రైతు ఫోన్ చేసి చెరువులు పరిస్థితిపై  ప్రశ్నించగా , తను చేయాల్సిన పని చేశానని ఇంకేం చేయలేనని, ఎస్టిమేషన్ నివేదిక పంపించామని ప్రభుత్వం నుంచి  రాకుండా మేమెలా చేస్తామని బదులిచ్చారు. ప్రస్తుత డీఈ, ఏఈ లు ట్రాన్స్​ఫర్​ అయి వెళ్లిపోగా కొత్తగా వచ్చిన వారికి అవగాహన లేకపోగా ప్రాబ్లమ్​పరిష్కారం కావడంలేదు.  కొత్తగా వచ్చిన అధికారులైనా తమను పట్టించుకొని చెరువులను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.  అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో 1100 ఎకరాల పంట నష్టం కాగా, మంచాల, యాచారం, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూర్ , మండలాల్లో ఒక్కో మండలంలో వెయ్యి ఎకరాల పైనే నష్టం జరిగింది. దీనిపై ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించామని అగ్రికల్చర్ అధికారులు తెలిపారు.

ఎప్పుడు తెగుతాయో తెలియని స్థితి..

గతేడాది భారీ వానలకే చెరువులు నిండిపోగా, ఈసారి కురిసిన భారీ వానలకు మరింత నిండుగా మారాయి. అయితే చెరువుల కట్టలు ధ్వంసమై ఎప్పుడు తెగుతాయో తెలియని పరిస్థితి ఉండగా, సమీప గ్రామాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. అబ్దుల్లాపూర్ మెట్ పరిధి ఇనాంగూడ చెరువు కట్ట డేంజర్​గా ఉంది. దీంతో చెరువులోకి నీరు చేరకుండా డైవర్ట్ చేశారు. దీని కింద ఇండ్లతో పాటు వ్యవసాయ పొలాలు, డైరీ, కోళ్ల ఫామ్స్​ఉండగా వాటికి ప్రమాదం పొంచి ఉంది. గతేడాది వానలకు చెరువు కింద మునిగిన పొలాలు కొన్నైతే, చెరువు కట్ట తెగిపోయి వందల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. ఇలా నష్టపోయిన రైతులను ఇప్పటివరకు  ప్రభుత్వం ఆదుకోలేదు. రెవెన్యూ అధికారుల రిపోర్ట్​ ఇవ్వగా పక్కన పడేసింది. భూముల్లో పెద్ద బండరాళ్లు, ఇసుకు మేట వేయగా పంటలకు పనికి రాకుండా ఉండగా,  వ్యవసాయంపైనే జీవించే వారు ఇప్పటి వరకు పంట వేసుకోలేదు. అబ్దుల్లాపూర్ మెట్​లోని  రెడ్డికుంట తెగి దాని కింద ఉన్న 8 ఎకరాల భూమి రాళ్లు, ఇసుకతో నిండిపోయింది. దీంతో బాధిత రైతులు సాగుకు దూరమవగా, దీనిపై స్పందించాల్సిన స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదు. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్​లో కొన్ని వేల ఎకరాల పంట నష్టమైతే ఇప్పటివరకు బాధిత రైతులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదుకోలేదని స్థానికులు చెప్తున్నారు. ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా తాము ప్రభుత్వానికి అంచనాలు పంపామని, పూర్తి వివరాలు తెలియదన్నారు. అధికారులు నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి ఇచ్చి 9 నెలలు దాటినా స్పదించకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. 

ప్రాసెస్​ తెలియదు

గతేడాది కురిసిన భారీ వానలకు అబ్దుల్లాపూర్ మండలంలో సుమారు 11వందల ఎకరాల పంట నష్టం జరిగింది. దీనికి సంబంధించిన  పూర్తి వివరాలతో ప్రభుత్వానికి రిపోర్ట్​ పంపించాం. ఆ ప్రాసెస్ ఎంత వరకు వచ్చిందనేది తెలియదు.   

- ఉమా, అగ్రికల్చర్ ఆఫీసర్, అబ్దుల్లాపూర్ మెట్

తొమ్మిది నెలల కిందటే రిపోర్ట్​ పంపించాం 

దెబ్బతిన్న చెరువులు, కుంటల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి 9 నెలల కిందటనే అంచనా రిపోర్ట్​ పంపించగా, ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇక్కడికి కొత్తగా వచ్చాను. క్లారిటీ తీసుకుని విజిట్ చేస్తా.  అప్రూవల్​ రాగానే  చెరువుల మరమ్మతు పనులు ప్రారంభిస్తం.

- ఉషారాణి, ఇరిగేషన్ డీఈ

చెరువైనా బాగు చేయాలె 

రెండు లక్షలు అప్పు తెచ్చి  పంట వేసినం. ఎంత కష్టం వచ్చిన పంట పాడుకాకుండా కష్టపడ్డాం. చెర్ల నీళ్లన్ని వచ్చి రాత్రికి రాత్రే చేను ఆగమైంది. ఏడాది దాటినా ఏ ఒక్కలూ ఆదుకుంటలేరు. నష్టం ఇయ్యకపోయిన సరే చెరువు బాగు చేస్తే చాలు. ఎమ్మెల్యే, అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వలూ పట్టించుకోలేదు. 

- నర్సమ్మ, అబ్దుల్లాపూర్ మెట్