
తిరుమల వెంకన్న సన్నిధిలో లైన్లో నిలుచున్న భక్తుడికి సడెన్ గా గుండెపోటు వచ్చింది. ఆ దేవుడే దిగి వచ్చాడా అన్నట్లు ఒక పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడాడు. నువ్వు దేవుడివి సామీ అని ఆ కుటుంబం అంతా ఆ పోలీస్ కు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆగస్టు 15 రాత్రి తిరుమలలో జరిగిన ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డాడు తెలంగాణకు చెందిన భక్తుడు.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి కి చెందిన మేడం శ్రీనివాసులు (61) వెంకన్న దర్శనం కోసం కుటుంబంతో తిరుమల వెళ్లాడు. శుక్రవారం (ఆగస్టు 15) రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో దర్శనం చేసుకున్నారు. అనంతరం లడ్డూ ప్రసాదాలు తీసుకుని కుటుంబ సభ్యులతో లడ్డు కౌంటర్ల వద్ద నుండి మ్యూజియం వైపుకు వెళుతున్నారు. పడమర మాడ వీధిలో ఉన్నట్లుండి శ్రీనివాసులుకు గుండెపోటు వచ్చింది.
మాట్లాడుతుండగానే గుండెను పట్టుకుని కింద పడిపోయాడు శ్రీనివాసులు. అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించి వెంటనే భక్తుడి దగ్గరికి చేరుకున్నాడు. సమయస్ఫూర్తితో 90 సార్లు ( 60×3=90) CPR చేశాడు. దీంతో భక్తుడు కొంచెం కోలుకోగా వెంటనే అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు.
►ALSO READ | శ్రీశైలంలో భక్తుల రద్దీ.. స్పర్శ దర్శనం రద్దు..
అశ్విని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సిమ్స్ ఆస్పత్రి చికిత్స పొందిన తర్వాత సదరు భక్తుడు ప్రాణాలతో బతికి బయట పడ్డాడు. డ్యూటీ డాక్టర్లు డిశ్చార్జ్ చేసి పంపడం జరిగినది. సమయస్ఫూర్తితో స్పందించి భక్తుడిని కాపాడినందునకు భక్తులు, అధికారులు కానిస్టేబుల్ గుర్రప్పను అభినందించారు.