
- హామీలేతప్ప.. ఫండ్స్ ఇవ్వని సర్కారు
- ఎన్టీపీసీకి ధూళికట్ట బౌద్ధస్తూపం బాధ్యత
- నేలకొండపల్లి స్తూపం సింగరేణికి
పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ ఏర్పడగానే పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లోని బౌద్ధస్తూపాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ప్రభుత్వం .. ఇంతకాలమైనా పైసా విడుదల చేయలేదు. దీంతో వీటి అభివృద్ధి బాధ్యతలనుంచి సర్కారు తప్పుకుని.. కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలోని పురాతన, చారిత్రక ప్రదేశాలను గుర్తించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట, వడ్కాపూర్ నడుమ ఉన్న బౌద్దస్తూపం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఉన్న బౌద్దస్తూపాలను టూరిజం సెంటర్లుగా మారుస్తామని, అవసరమైన నిధులు సమకూర్చుతామని చెప్పింది. అభివృద్ధి కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో టర్మ్ కూడా పూర్తకావస్తున్నా ఇప్పటికీ వీటి అభివృద్ది కోసం నయాపైసా విడుదల చేయలేదు. సర్కారు ఫండ్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో దూళికట్ట బౌద్ధ స్తూపాన్ని ఎన్టీపీసీకి, ఖమ్మం జిల్లా స్తూపాన్ని సింగరేణికి అప్పగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్టీపీసీకి దూళికట్ట..
ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోవడంతో దూళికట్ట స్తూపం నిర్లక్ష్యానికి గురవుతోంది. చాలామంది రిసర్చ్ స్కాలర్లు స్టడీ కోసం ఇక్కడికి వస్తున్నారు. వారికి ఇక్కడ కనీస సదుపాయాలు లేవు. ఆసక్తితో ఇచ్చే టూరిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ స్తూపాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలన్న ఆలోచన చేసింది. ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు ఇదివరకే హరితహారం లాంటి ప్రభుత్వ స్కీమ్‌లను స్పాన్సర్ చేస్తున్నాయి. వీటికే స్తూపాల డెవలప్మెంట్ కూడా అప్పగించాలని నిర్ణయించింది. బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఇటీవల పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ను కలిసి పెద్దపల్లి బౌద్దస్తూపం బాధ్యతను ఎన్టీపీసీ యాజమాన్యానికి అప్పగించే అంశం మీద చర్చించినట్లు తెలిసింది. ఈ విషయంలో తొందరలోనే క్లారిటీ రానుందని సమాచారం.
మట్టిరోడ్డు ఒక్కటే..
తెలంగాణ ఏర్పడగానే పెద్దపల్లి, ఖమ్మం బౌద్ద స్తూపాలపై సర్కారు దృష్టి సారించింది. వీటిని పర్యాటకకేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 2018లో ధూళికట్టకు పంపించింది. వారు అక్కడికి వెళ్లి శిథిలావస్థలో ఉన్న బౌద్ద స్తూపానికి వెంటనే రిపేర్లు చేయించేందుకు అప్పటికప్పుడు రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. దూళికట్ట, వడ్కాపూర్ మధ్య ఉన్న స్తూపం వరకు రోడ్డు లేకపోవడంతో తాత్కాలికంగా మట్టి రోడ్ వేయించారు. ఆ తర్వాత వారు కూడా బౌద్ద స్తూపం సంగతి మర్చిపోయారు. వారు ప్రకటించిన ఫండ్స్ కూడా రిలీజ్ చేయించలేదు.