టీచర్లు, ఉద్యోగులు గోస పడుతున్నా సర్కారు పట్టించుకుంటలే

టీచర్లు, ఉద్యోగులు గోస పడుతున్నా సర్కారు పట్టించుకుంటలే
  • జీవో రద్దు కోసం ఎక్కడికక్కడ ఆందోళనలు
  • ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్, విద్యాశాఖ మంత్రి ఇంటి వద్ద ధర్నా
  • హైకోర్టులో 60కి పైగా పిల్స్​.. గవర్నర్‌‌కు ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్, వెలుగు: జీవో 317పై రాష్ట్ర సర్కారు మొండిపట్టు వీడట్లేదు. జీవో అమలు చేసి తీరాల్సిందేనని, గడువులోగా ఉద్యోగులు అందరూ జాయిన్​ కావాల్సిందేనని తేల్చి చెప్తున్నది.  ఉద్యో గులు, ఉపాధ్యాయులు గోసపడుతున్నా పట్టించుకుంటలేదు. జోనల్​ మొదలు జిల్లా పోస్టుల వరకు అన్నింటిలోనూ తమకు అన్యాయం జరిగిందంటూ బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికతను లెక్కలోకి తీసుకోకుండా ఇష్టమున్నట్లు బదిలీలు చేపట్టారని అంటున్నారు. అర్థం పర్థం లేకుండా తెచ్చిన ఈ జీవోను రద్దు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 317 జీవోతో నష్టపోయామన్న మనోవేదనతో ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయారు. ఉద్యోగులు,  టీచర్లు సోమవారం సెక్రటేరియట్​ ముట్టడికి ప్రయత్నించారు. స్కూల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్​ ఎదుట తమ పిల్లాపాపలతో టీచర్లు ధర్నాకు దిగారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ఇంటర్​ విద్యా జేఏసీ ముట్టడించింది. ఎంప్లాయీస్ ఆందోళనలకు ప్రతిపక్షాలు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్​ జిల్లాకు చెందిన టీచర్​ సరస్వతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ, కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

స్థానికతను పట్టించుకోకపోవడంతో..!

రాష్ట్రంలో జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లకు ఎంప్లాయీస్, టీచర్ల అలకేషన్ కోసం డిసెంబర్ 6న సర్కారు జీవో 317ను తీసుకొచ్చింది. జీవో విడుదలకు ముందు టీజీవో, టీఎన్జీవో సంఘాలతో మాత్రమే చర్చించి, ఎక్కువ సంఖ్యలో ఉన్న టీచర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీచర్ యూనియన్లతో చర్చించలేదు. అకడమిక్ ఇయర్ మధ్యలో ఈ ప్రాసెస్​ నిర్వహించడంతో అందరిలో ఆందోళన మొదలైంది. మొత్తం టీచర్లలో నాలుగో వంతు మందిని.. అంటే  95,877 మంది టీచర్లలో 22,418 మందిని వేరే జిల్లాలకు అలాట్​ చేశారు. ఇది స్కూల్ ఎడ్యుకేషన్​డిపార్ట్​మెంట్​ను కుదిపేస్తున్నది. ఇతర డిపార్ట్​మెంట్లకు చెందిన మరో 13,760 మంది కూడా వేరే జిల్లాలకు అలాట్​ అయ్యారు. వేల మంది ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల ఎంప్లాయీస్, లెక్చరర్లు, ఇతర డిపార్ట్​మెంట్ల ఎంప్లాయీస్ కూడా వేరే జోన్లు, మల్టీజోన్లకు అలాట్​ అయ్యారు. జీవోలో లొకాలిటీని కాకుండా సీనియారిటీని ప్రయారిటీగా తీసుకొని శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్​లు ఇస్తుండటంతో తాము పూర్తిగా స్థానికతను కోల్పోవాల్సి వస్తున్నదని టీచర్లు, ఎంప్లాయీస్ ఆందోళన చెందుతున్నారు. తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఒకో వైపు స్పౌజ్ బదిలీలపైనా సర్కారు క్లారిటీ ఇవ్వడం లేదు. టీచర్లకు సంబంధించి 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను నిషేధించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భార్యాభర్త ఒకే జిల్లాలో పనిచేసుకునే అవకాశం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఇలా వేర్వేరు జిల్లాలో పనిచేయాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దంపతులైతే  250 కిలోమీటర్ల దూరంలో డ్యూటీ చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. జీవోకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసేందుకు టీచర్లు, ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఒక్క స్కూల్ ఎడ్యుకేషన్​ పరిధిలోనే 60 వరకు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.  

తొమ్మిది మంది బలి

రాష్ట్రంలో జీవో 317కు 9 మంది టీచర్లు, ఎంప్లాయీస్ బలైనట్టు ఆయా సంఘాల నేతలు చెప్తున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకోగా, ఇంకొందరు మనోవేదనతో గుండెపోటుకు గురై చనిపోయారు. 10 రోజుల కింద మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చినముప్పారం ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ జైత్​రాం గుండెపోటుతో చనిపోయారు. ఆదివారం ఒక్కరోజే ఇద్దరు టీచర్లు చనిపోయారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన సరస్వతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరోపక్క ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపాలంటూ సర్కారు పెద్దల నుంచి ఒత్తిడి వస్తుండటంతో రాష్ట్ర, జిల్లా ఆఫీసుల్లో పనిచేసే అధికారులు, స్టాఫ్ కూడా టెన్షన్ పడుతున్నారు. చాలా ఆఫీసుల్లో రాత్రిపూట, సెలవు రోజుల్లోనూ పని చేస్తున్నారు. ఇలా పనిచేస్తూనే రెండు వారాల కింద టెక్నికల్ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్ లోని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీశైలం గుండెపోటుతో ప్రాణాలు విడిచారని తోటి ఎంప్లాయీస్​ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆందోళనలు తగ్గట్లే.. సవరణలూ చేయట్లే 

317 జీవోను రద్దు చేయాలని కొన్ని టీచర్ సంఘాలు, సవరించాలని మరికొన్ని సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అయినా కనీసం టీచర్ల సంఘాలతో ప్రభుత్వం చర్చలు కూడా జరపడం లేదు. మొదట్లో టీచర్ల నుంచి ఆప్షన్లు తీసుకున్న తర్వాత విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి టీచర్ల సంఘాలతో చర్చించారు. అయితే.. 
ఆ సంఘాల ప్రతినిధులు చేసిన ఏ ఒక్క ప్రతిపాదన కూడా సర్కారు పట్టించుకోలేదు. ప్రతి జిల్లాలో సీనియార్టీతో పాటు స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని, విడోస్, ఒంటరి మహిళలను స్పెషల్ కేటగిరిలో చేర్చాలని, మ్యూచువల్ ట్రాన్స్​ఫర్లకు అంగీకరించాలని  టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం అడ్ హక్ కేటాయింపులు చేసి, వేసవిలో సాధారణ బదిలీలు చేయాలని అంటున్నారు. సర్కారు స్పందించకపోవడంతో సోమవారం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆఫీసు ఎదుట టీచర్లు ఆందోళనకు దిగారు. చంటి పిల్లలతో తరలివచ్చి తమ గోస చెప్పుకున్నారు. భార్యాభర్తలకు ఒకే జిల్లాలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.  

మంత్రి ఇల్లు ముట్టడి

లెక్చరర్ల అలకేషన్​లో లోపాలను సరిచేయాలని  డిమాండ్​ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని సోమవారం ఇంటర్ విద్యా జేఏసీ ముట్టడించింది. జేఏసీ చైర్మన్ మధుసూధన్​రెడ్డి మాట్లాడుతూ.. కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు పొందినవాళ్లకు ప్రయారిటీ ఇవ్వాలని జీవోలో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. విద్యాశాఖ సెక్రటరీ సందీప్​ కుమార్ సుల్తానియా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సబితారెడ్డి స్పందించి.. న్యాయం చేస్తామని చెప్పారు. ఇంటర్  కమిషనరేట్​లో సెక్రటరీ ఉమర్ జలీల్​ను గంటన్నర పాటు ఆయన చాంబర్​లో నిర్బంధించారు. నిరసనలో జేఏసీ సెక్రెటరీ జనరల్ కృష్ణకుమార్, శ్రీనివాస్​రెడ్డి, లక్ష్మీ, విజయశేఖర్, కవితాకిరణ్, మాధవ్ రావు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్​కు ఫిర్యాదుల వెల్లువ

టీచర్లు, ఎంప్లాయీస్​కు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీ, వైఎస్ఆర్​టీపీ ఆందోళనలు చేస్తున్నాయి. ప్రజా సంఘాలు చేస్తున్నాయి. ఇటీవల గవర్నర్​ తమిళిసైకి బీజేపీ నేతలు, బీసీ  సంఘం నేత జాజుల శ్రీనివాస్​ గౌడ్​ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజ్​భవన్​లోని గ్రీవెన్స్​ బాక్స్​లో లెటర్​ వేశారు.

నా పిల్లల్ని చూసుకునుడెట్ల

సిద్దిపేట జిల్లా సికిండ్లపూర్ జెడ్పీహెచ్​ఎస్ లో టీచర్​ (ఎస్​ఏ)గా పనిచేస్తున్న. ఇప్పుడు మెదక్ జిల్లా  కన్నారం స్కూల్​కు అలాటైంది. మా ఆయన సిద్దిపేట జిల్లా రుద్రారంలో ఎస్జీటీ. మా ఆయన, నేను ఉండే ఏరియా నుంచి ఇప్పుడు పోస్టింగ్​ వచ్చిన ఏరియా వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాకు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నరు. స్కూలుకు ఉదయం 7కు బయల్దేరితే.. తిరిగి రాత్రి 8 గంటలకు రావాల్సి ఉంటది. అప్పటిదాకా పిల్లల్ని ఎవరు చూస్కుంటరు. ప్రభుత్వం స్పౌజ్ కేటగిరి అలాట్​మెంట్లు చేపట్టి, భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్​ ఇవ్వాలి. 

- విద్యారాణి, టీచర్

220 కి.మీ. ఎట్ల పోయి రావాలె?

నేను  9 నెలల ప్రెగ్నెంట్​ని. మాకు రెండేండ్ల బాబు ఉన్నడు. జనగాం జిల్లాలోని నాగిరెడ్డిపల్లి స్కూల్​లో ఎస్జీటీగా పనిచేస్తున్న. ఇప్పుడు  మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం యూపీఎస్​కు పోస్టింగ్​ ఇచ్చిన్రు. మా ఆయన మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​  పోలీస్​స్టేషన్​లో పనిచేస్తున్నరు. మేం ఉండే (ఘట్​కేసర్​) ప్లేస్​ నుంచి నాకు పోస్టింగ్​ వచ్చిన ఏరియా 220 కిలోమీటర్లు ఉంటది. నా బిడ్డను వదిలి రోజూ అక్కడికి ఎట్ల పోయిరావాలి?  

‑ జ్యోతి, టీచర్ 

న్యాయం చేయాలి

టీచర్లు, ఎంప్లాయీస్ మరణాలు బాధాకరం. ప్రభుత్వం పంతానికి పోయి వారి మరణానికి కారణమైంది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్  స్పందించి, సంఘాలతో చర్చించాలి. స్థానికత కోల్పోయిన బాధిత టీచర్లకు న్యాయం చేయాలి. స్పౌజ్ కేటగిరి, ఒంటరి మహిళలకు, వితంతువులకు జిల్లాల కేటాయింపుల్లో ప్రయార్టీ ఇవ్వాలి. పరస్పర బదిలీలకు అంగీకరించాలి. 

- మైస శ్రీనివాస్, టీపీటీఎఫ్​ స్టేట్ జనరల్ సెక్రెటరీ