
హైదరాబాద్, వెలుగు:
ఐదేండ్ల క్రితం ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఆ తర్వాత జికా అంటూ మరొకటి ముప్పు తిప్పలు పెట్టింది. అది ఉన్నప్పుడే స్వైన్‌ఫ్లూ వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. ఒకదానిని మించి ఒక వైరస్ వందల మందిని పొట్టనపెట్టుకుంటున్నాయి. అలాంటి వైరస్‌లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దవాఖానా ఉంటే ఎట్లుంటది? అందుకే అలాంటి ఒక హాస్పిటల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది రాష్ట్ర సర్కారు. కొత్త వైరస్లు వచ్చినప్పుడే హడావుడిగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయకుండా, వైరస్ల కోసమే ఓ ప్రత్యేక దవాఖానాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్ ఐసీయూ వార్డులతో ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో ఆ హాస్పిటల్‌ను నిర్మించేందుకు రెండేండ్ల క్రితమే ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్‌ను సిద్ధం కూడా చేశారు. అయితే, బడ్జెట్ లేకపోవడంతో అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఢిల్లీ, పుణేలో మాత్రమే ఇలాంటి దవాఖానాలు ఉన్నయి. వీటిని ‘క్లీన్ వార్డ్’లుగా పిలుస్తారు. ఇలాంటి ఆస్పత్రులను కట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఓ ఉన్నతాధికారి వివరించారు. ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడంతో, కేంద్రం నుంచి ఓ టీమ్ వచ్చి చెస్ట్ హాస్పిటల్లో ‘క్లీన్ వార్డు’ కట్టాలనుకున్న ప్రాంతాన్ని చూసి ఓకే చేసిందన్నారు. వైరస్‌లను ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేక బ్లాక్‌ను కడుతున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ కూడా మీడియాకు వెల్లడించారు.
ఇట్లుంటది ‘క్లీన్‌వార్డు’
ఐదెకరాల్లో నాలుగు లేయర్లుగా క్లీన్ వార్డును కడతారు. ఇందులో 5 ఐసోలేషన్ వార్డులుంటాయి. మొత్తం వార్డులు కలిపి 50 నుంచి 60 బెడ్లుంటాయి. అనుమానిత కేసులను ఈ వార్డుల్లోనే అబ్జర్వేషన్లో పెడతారు. 12 బెడ్లతో కూడిన వెంటిలేటర్ ఐసీయూ వార్డ్ ఒకటి ఉంటుంది. వైరస్ ఉన్నట్టు రూఢీ అయితే ఈ వార్డులోకి పేషెంట్‌ను షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటారు. ఈ హాస్పిటల్లోకి పేషెంట్లు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాక్టర్లు, స్టాఫ్‌ను మాత్రమే అనుమతిస్తారు. బయటి నుంచి తొలి రెండు వార్డుల వరకే వార్డ్బాయ్స్కు అనుమతి ఉంటుంది. డాక్టర్లు, నర్సులను మాత్రమే ఐసోలేషన్ వార్డుల్లోకి రానిస్తారు. ప్రతి వార్డుకి సెంట్రల్ గైడ్‌లైన్స్, ప్రొటోకాల్ పాటించాల్సి ఉంటుంది. వార్డులోకి వెళ్లాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంట్రెన్స్‌లో బోర్డులపై రాసి ఉంచుతారు. ఆ నిబంధనలు పాటించకుండా లోపలికి ఎవరినీ అనుమతించరు.