15 రోజులుగా చీకట్లో కేసీఆర్​.. ఎక్కడున్నరో తెలియదు: జీవన్​ రెడ్డి

15 రోజులుగా చీకట్లో కేసీఆర్​..  ఎక్కడున్నరో తెలియదు: జీవన్​ రెడ్డి
  • ఉద్యోగులకు 20 శాతం ఐఆర్​ఇవ్వాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీ ఆర్​ఎక్కడికి పోయారో తెలియడం లేదని,15 రోజులుగా చీకట్లోనే ఉన్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. కేసీఆర్​పాలన చూస్తుంటే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా ఉందన్నారు. గురువారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర కీలకమని, అలాంటి వాళ్లపై సర్కారు వివక్ష చూపిస్తున్నదని మండిపడ్డారు. పీఆర్సీ కమిటీని ఆలస్యంగా వేయడమే కాకుండా ఐదు శాతమే ఐఆర్​ఇవ్వడం దారుణమన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రెండుసార్లు ఇరవై శాతం కన్నా ఎక్కువే ఇచ్చిందని గుర్తు చేశారు. పెరిగిన ధరలకు అను గుణంగా ప్రభుత్వం 20 శాతం ఐఆర్​ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పెం డింగ్​లో ఉన్న మూడు డీఏలనూ వెంటనే విడుదల చేయాలన్నారు.

పింఛన్​ విధానం రాష్ట్రాల ఇష్టమని కేంద్రం స్పష్టం చేసినా.. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్​పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్​ను అమలు చేస్తున్నామని చెప్పారు. జోనల్ ​సిస్టం అస్తవ్యస్తంగా మారిందన్నారు.10 ఉమ్మడి జిల్లాల ఆధారంగా జోనల్​ సిస్టమ్​ను పునర్వ్యవస్థీకరించాలని ఆయన డిమాండ్​ చేశారు. 317 జీవోతో టీచర్లనూ ఇబ్బందులు పెడుతున్నదని, ఉపాధ్యాయ దంపతులు కలిసి సంసారం చేయలేని పరిస్థితి దాపురించిందన్నారు. పిల్లల భవిష్యత్​ఏంటో అర్థంగాక ఓ టీచర్​ ఆత్మహత్య చేసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ వేస్తారో.. వెయ్యరో తేల్చి చెప్పాలని కేసీఆర్​ను డిమాండ్​ చేశారు.