మా సారు గెలిస్తే మంత్రి పదవి ఖాయం!

మా సారు గెలిస్తే మంత్రి పదవి ఖాయం!

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరో 15 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇతర పార్టీల కంటే 2 నెలల ముందే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో మూడో సారి అధికారంలోకి వస్తున్నామని,  కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నది. అయితే, జిల్లాల్లో అభ్యర్థుల అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు మాత్రం “ మా సారు గెలిస్తే ఈ సారి కచ్చితంగా మంత్రి అవుతరు ”  అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

 ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళితే ఓట్లు పడతాయని వారు చెబుతున్నారు. మంత్రి అయితే నియోజకవర్గం మరింత అభివృద్ధి  చెందుతుందని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు ఎస్టీ, ఇద్దరు ఎస్సీ, ముగ్గురు ఓసీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వస్తుందని చెప్పుకుంటున్నారు. ఖమ్మంలో ఎస్సీ, ఓసీ ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల్లో పలువురు మహిళా ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవి వస్తుందని వారి అనుచరులు ప్రచారం చేస్తున్నారు.

ఇన్ చార్జిలదీ ఇదే మాట

రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు  బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జ్ లను నియమించింది. అభ్యర్థుల ప్రకటన నాటి నుంచే వారు నియోజక వర్గాల్లో ఉంటూ క్యాండిడేట్​కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. వాళ్లు కూడా “ మీ సారు గెలిస్తే మంత్రి పదవి ఖాయం. మీ సారుకు పెద్ద సారు కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి”  అని ప్రతి చోటా చెప్తున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు మంత్రి పదవులు ఇచ్చే టైమ్​లో ఎన్నో సమీకరణాలు ఉంటాయని,  ఇన్ చార్జ్ లు చెబుతున్న మాటలు నమ్మొద్దని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జిల్లా, క్యాస్ట్,  మహిళ ఇలా ఎన్నో అంశాలు ఉంటాయంటున్నారు. ఒక్కో సారి క్యాస్ట్ ప్లస్ పాయింట్ అవుతదని, మరో సారి క్యాస్ట్ మైనస్ అవుతదంటున్నారు.  పార్టీలు బీసీలకు  25 లోపే సీట్లు ఇవ్వగా, బీజేపీ 37 సీట్లు ఇచ్చింది. బీసీలు ప్రస్తుత కేబినెట్ లో ముగ్గురే ఉన్నారు. 

దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య టఫ్ పోటీ నెలకొంది. ఈ జిల్లాలో ఈ సారి అధికార పార్టీ అభ్యర్థులు గెలవాలంటే కష్టపడాల్సిందేనని విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే.. ఈ సారి గెలిస్తే మంత్రి అవుతారని ఆయన అభిమానులు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కేబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని సీఎం ఆఫర్ ఇచ్చినా ఆయన తిరస్కరించారు. దీంతో ఈ సారి మంత్రి పదవి కన్ ఫర్మ్ అని చర్చ జరుగుతోంది.

ఉత్తర తెలంగాణలోనే అది కీలకమైన ఉమ్మడి జిల్లా. గత ప్రభుత్వంలో ఆ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండగా.. ఈ సారి పలు సామాజిక వర్గాల నుంచి ఆరుగురు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఆ ఆరుగురు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అయితే, గెలిస్తే మంత్రి పదవి అడుగుతారని సొంత పార్టీ నేతలే ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు ఓడాలని కోరుకుంటున్నారని చర్చ జరుగుతోంది. వారి ఓటమికి కుట్రలు సైతం చేస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు.