
- బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ బీసీ వ్యతిరేక పార్టీలే
- కేసీఆర్‌కు దమ్ముంటే బడుగు బలహీనవర్గాల నేతను సీఎంగా ప్రకటించాలె
- బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఏది వచ్చినా ఆ ప్రభుత్వం పడిపోతుందని కామెంట్
కరీంనగర్/నారాయణపేట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. కేసీఆరే స్వయంగా పైసలిచ్చి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చూస్తున్నారు” అని ఆరోపించారు. బుధవారం రెండోరోజు కరీంనగర్ లోకల్లో సంజయ్ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. నారాయణపేటలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. ‘‘కరీంనగర్ లోనూ సర్కార్ వ్యతిరేక ఓట్లను చీల్చే కుట్ర జరుగుతోంది. కరీంనగర్ ప్రజలెవరూ మోసపోవద్దు. బీఆర్ఎస్ పాలనలో భూకబ్జాలు, డ్రగ్స్, కమీషన్ల దందాతో కరీంనగర్ అల్లాడుతున్న సంగతిని మరిచిపోవద్దు” అని సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ వ్యతిరేక డీఎన్ఏ ఉంది. అందుకే కేసీఆర్ సర్కార్ లో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులిచ్చారు. కేసీఆర్ కు బడుగు బలహీన వర్గాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించాలి” అని సవాల్ విసిరారు.
ఆరెపల్లి మోహన్.. పక్కా లోకల్
మానకొండూరు బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ పక్కా లోకల్ అని, నియోజకవర్గంలోని గల్లీగల్లీపై ఆయనకు అవగాహన ఉందని సంజయ్ అన్నారు. మోహన్ ను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. బుధవారం మానకొండూరులో ఆరెపల్లి మోహన్ నామినేషన్ కార్యక్రమానికి సంజయ్ హాజరయ్యారు. మానకొండూరు చెరువు నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
ఎంఐఎం చేతుల్లో బీఆర్ఎస్ స్టీరింగ్..
బీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని సంజయ్ విమర్శించారు. ‘‘కేసీఆర్, ఒవైసీ.. ఎన్నికలు లేనప్పుడు అన్నదమ్ములు. ఎన్నికలు వచ్చాక మామా అల్లుళ్లు. ఎన్నికలు అయ్యాక బావాబామ్మర్దుల లెక్క దోస్తీ చేస్తుంటే ప్రజలు సిగ్గుపడుతున్నారు” అని అన్నారు. ‘‘బీజేపీ అధికారంలోకి రాగానే జాయమ్మ చెరువు పూర్తి చేసి, లక్ష ఎకరాలను సాగు నీళ్లు ఇస్తాం. కోటకొండ, గార్లపాడు, కాన్కుర్తి గ్రామాలను మండలాలు చేస్తాం” అని హామీ ఇచ్చారు. రోడ్ షోలో గోవా ఎమ్మెల్యే కృష్ణ, బీజేపీ అభ్యర్థి రతంగ్‌పాండురెడ్డి పాల్గొన్నారు.
అమెరికాలో చిప్పలు కడిగిన కేటీఆర్‌కు ఇన్ని కోట్లు ఎక్కడివి?
కేసీఆర్ డిసెంబర్ 3 తర్వాత మాజీ సీఎం అవుతారని సంజయ్ అన్నారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్గెలిస్తే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతారు. అప్పుడు కవిత, హరీశ్‌రావు, హ్యాపీ రావు.. తమ ఎమ్మెల్యేలను తీసుకుని బయటకు వెళ్తారు. ప్రభుత్వం పడిపోతుంది. ఇక కాంగ్రెస్ గెలిస్తే.. అందులో అందరూ సీఎంలే. సీఎం సీటు కోసం కొట్లాడి, ఆ ప్రభుత్వం కూడా పడిపోతుంది” అని అన్నారు. బీసీ సీఎం, సుస్థిర ప్రభుత్వం కావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. ‘‘సీఎం కొడుకు అమెరికాలో చిప్పలు కడిగారు. అలాంటి వ్యక్తి ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు. ఆ ట్విట్టర్ టిల్లు అయ్య పాస్ పోర్టుల బ్రోకర్. ఇక్కడి యువకులను ముంబై తీస్కపోయి, అదే దుబాయ్ అని చెప్పి మోసం చేశారు. కేటీఆర్, కవిత, హరీశ్‌రావు.. తెలంగాణ కోసం ఏ ఉద్యమం చేశారో చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ‘‘పాలమూరు జిల్లాలో వలసలు లేవని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం. నేను పాదయాత్ర చేసిన సమయంలో రెండు ముంబై బస్సుల్లో ప్రజలతో మాట్లాడాను. వాళ్లతో మాట్లాడితే వలస బతుకుల బాధేంటో తెలిసింది” అని చెప్పారు.