సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. గుళ్లు గోపురాలు, స్వాముల దర్శనాలు తప్ప కేసీఆర్ ప్రజాపాలనపై దృష్టిపెట్టడం లేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా ప్రెస్ మీట్ లో మాట్లాడిన చాడ.. ఓ వైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూనే.. రాష్ట్రాల హక్కులను హరించే బిల్లులకు వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినా.. చర్చలు జరపడం లేదన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే విడుదల చేసి.. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పడంతో పాటు..వారికి ఆరు నెలలుగా వారికి జీతాలివ్వకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. సచివాలయం నిర్మాణం తో ఫైళ్లన్నీ చిందరవందర చేసారన్న చాడా.. ఏం కొంపలు మునిగాయని కొత్తది కడుతున్నారని ప్రశ్నించారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై సీఎం ఇప్పటికైనా దృష్టి సారించాలని….లేదంటే చరిత్రలో దోషిలా మిగిలిపోతారని హెచ్చరించారు.
