అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని, ప్రజల్ని నిట్టనిలువునా మోసం చేయడంలో దిట్ట అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం గాంధీభవన్​లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చెరుకు సుధాకర్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, ఆ తర్వాత మర్చిపోతారన్నారు. ఎనిమిదేండ్లుగా ఆయన ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చలేదన్నారు. దళిత సీఎం, ఇంటికో ఉద్యోగం, గిరిజన రిజర్వేషన్, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయలేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధును ప్రకటించి, ఆ తర్వాత దానిని అటకెక్కించారని విమర్శించారు. 

మునుగోడు ఉపఎన్నిక కోసం గొర్ల పంపిణీ అని చెప్పి, దానిని ఓ ప్రహసనంగా మార్చారన్నారు. రుణమాఫీ, ఉచిత ఎరువుల పేరుతోనూ కేసీఆర్ మోసం చేశారన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా మరింత జటిలంగా మార్చారన్నారు. ఇపుడు బీఆర్ఎస్​లోకి ఆంధ్రా నాయకులను ఆహ్వానిస్తూ కొత్త ఎత్తులు వేస్తున్నారని చెప్పారు. బీజేపీ డైరెక్షన్ మేరకే బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కేసీఆర్ తన కుటుంబ ఆస్తులు మరింత పెంచుకునే ఆలోచనతో ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్​కు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పనులన్నీ గోల్ మాల్ గోవిందం తరహాలో ఉన్నాయని విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అన్ని స్కీమ్​లను తెస్తారన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షా డైరెక్షన్​లోనే బీఆర్ఎస్ ను నడుపుతున్న కేసీఆర్ కుట్రలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.