కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం: కేసీఆర్

 కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం: కేసీఆర్

కొత్త ప్రభుత్వానికి సహకరిద్ధామని.. ఏం జరుగుతుందో చూద్దామని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో బీఆర్ఎస్ మాజీమంత్రలు, తాజా మాజీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారితో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్.. ప్రజల తీర్పును గౌరవిద్దాం.. రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నదని.. కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నామని.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏమి జరుగుతుందో వేచి చూద్దామని చెప్పినట్లు సమాచారనం. త్వరలో తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం నిర్వహించుకుని.. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుందామని.. త్వరలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందామని  బీఆర్ఎస్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తొలిసారి ప్రతిపక్షంలో కూర్చోబోతోంది. అయితే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు చాలామంది దీని గురించే చర్చించుకుంటున్నారు. ఓవైపు కాంగ్రెస్ పెద్దలు సీఎం ఎవరు అనేదానిపై బిజీగా ఉంటే.. ఇటు బీఆర్ఎస్ లో మాత్రం ప్రతిపక్ష నేతగా ఎవరు ఉండాలనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఎవరు ఉంటారు అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటారా..? ఉండరా..? అని చాలామంది చర్చించుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించకపోతే... ఆ బాధ్యతలను హరీష్ రావు లేదా కేటీఆర్ కు అప్పగిస్తారా...? అనే చర్చ సాగుతోంది. అంతేకాదు.. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..? రారా..? అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.