2019 సీన్​ రిపీట్.. సీఎల్పీలో బీఆర్ఎస్ఎల్పీ విలీనానికి కసరత్తు

2019 సీన్​ రిపీట్.. సీఎల్పీలో బీఆర్ఎస్ఎల్పీ విలీనానికి కసరత్తు
  • అప్పుడు ఎంపీ ఎన్నికల టైంలో సీఎల్పీని విలీనం చేసుకున్న కేసీఆర్ 
  • ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ ప్లాన్​ 
  • తొలుత ఫిరాయింపులు వద్దనుకున్న రూలింగ్ పార్టీ 
  • ప్రభుత్వాన్ని కూల్చేస్తమన్న కామెంట్లతో రూట్ చేంజ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ అనుసరించిన పొలిటికల్ స్ట్రాటజీయే ఇప్పుడు మళ్లీ లోక్ సభ ఎన్నికల సందర్భంగా రిపీట్ కానుంది. అప్పుడు బీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేసుకోగా.. ఇప్పుడు సీఎల్పీలో బీఆర్ఎస్ఎల్పీ విలీనానికి కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని సీఎల్పీని విలీనం చేసుకున్నది. ఇప్పుడు అదే బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తివేసినట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు.

మొన్నటివరకు పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఇవ్వొద్దని భావించినా.. ఇప్పుడు రూట్ మార్చారు. ‘‘ఈ సర్కార్ ఆరు నెలలే ఉంటది.. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం’’ అని పదే పదే ప్రతిపక్ష లీడర్లు చేస్తున్న కామెంట్లతో సీఎం రేవంత్​ అలర్ట్ అయ్యారు. చేరికల విషయంలో గతంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో.. ఇప్పుడు కూడా సరిగ్గా అదే తీరును అనుసరిస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్​ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఆయనను సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్​గా కూడా అనౌన్స్ చేశారు. దానంతోపాటు గతంలో సీఎం రేవంత్​ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్​లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొంత మంది ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.  

 కూల్చేస్తామన్న కామెంట్లతో అలర్ట్​ 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు (మిత్రపక్షం సీపీఐ–1) గెలిచి పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ 39  సీట్లకు పరిమితం కాగా.. బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పవడవద్దని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పాటు నుంచి అలాంటి కార్యక్రమాలకు తావివ్వలేదు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్​లో చేరుతామని చెప్పినప్పటికీ.. ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల వినతులనూ పరిగణనలోకి తీసుకుంటామని ఆయన క్లారిటీ ఇచ్చారు.

వాళ్లూ సీఎంను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు వేదికల మీద పదే పదే కామెంట్లు చేశారు. ఆయన ఆరు నెలల సర్కార్.. అంటూ చేసిన ఆ కామెంట్లే ఇప్పుడు బీఆర్ఎస్ కొంపముంచుతున్నాయి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్ చేశారు. ఆ రెండు పార్టీల నుంచి వరుసగా ఇలాంటి కామెంట్లు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చర్చించి ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేరికలకు ఓకే చెప్పినట్లు తెలిసింది. 

మూడో వంతు ఎమ్మెల్యేలొస్తే విలీనం.. 

ఇప్పటివరకూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినవారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్​గౌడ్, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ఉన్నారు. దానం నాగేందర్ ఇదివరకే కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి టచ్​లో ఉన్నట్లు తెలిసింది. లోక్​సభ ఎన్నికల సమయానికి వారందరినీ పార్టీలోకి తీసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే, బీఆర్ఎస్ కు మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున.. వారిలో రెండింట మూడొంతులు అంటే.. 26 మందిని చేర్చుకుంటే బీఆర్ఎస్ఎల్పీ విలీనం పూర్తవుతుంది. ఇలా విలీనమైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. అందుకే చట్టపరంగా అడ్డంకులు లేకుండా బీఆర్ఎస్ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది.  

అప్పుడు అవసరం లేకపోయినా.. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో గెలిచి బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో అవసరం లేకపోయినా.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ని పూర్తిగా బలహీనపర్చాలని ఫిరాయింపులకు తెర లేపారు. నాటి లోక్ సభ ఎన్నికల టైంలో అప్పటి సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వరుసగా తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. అలా కాంగ్రెస్ నుంచి గెలిచిన12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్​లో చేర్చుకుని.. సీఎల్పీని విలీనం చేసుకున్నారు. అప్పట్లో దీనిని కాంగ్రెస్ ఖండించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫిరాయింపులు ఉండవని  చెప్పింది.
కానీ రూట్ మారుస్తోంది.