రైతుల నుంచి వడ్లు కొనడం రాష్ట్రం బాధ్యత

రైతుల నుంచి వడ్లు కొనడం రాష్ట్రం బాధ్యత

రైతుల నుంచి వడ్లు కొనడం రాష్ట్రం బాధ్యత అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.  వరంగల్లో బీజేపీ రైతు సదస్సులో మాట్లాడిన ఆయన..  ముఖ్యమంత్రి రైతులను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి.. కొడుకుని సీఎం చేయాలని ప్లాన్ చేస్తున్నారని వివేక్ విమర్శించారు. ఆ కారణంగానే కేంద్రం మీద తప్పుడు ప్రచారం మొదలు పెట్టిండని అన్నారు.

దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును జీర్ణించుకోలేకే కేసీఆర్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నాడని వివేక్ అన్నారు. రైతులు పండించే ధాన్యం మొత్తాన్ని కొంటామని కేంద్రం చెబుతున్నా.. బీజేపీ ప్రభుత్వంపై నిందలు వేసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడని అన్నారు. బాయిల్డ్ రైస్ పై కమీషన్ల కోసమే కేసీఆర్ నిరసనలు చేయిస్తున్నడని విమర్శించారు. 

కేసీఆర్ తుగ్లక్ ముఖ్యమంత్రి అని.. ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోతోందని వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం కమిషన్లకు కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. రూ.60వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పును రూ. 5లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని సటైర్ వేశారు. ప్రజల గురించి పనిచేయడం మానేసి కుటుంబం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రికి జనమే బుద్ధి చెబుతారని అన్నారు.