అమెరికాకు కేసీఆర్ ఫ్యామిలీ! పాస్ పోర్టు రెడీ చేసుకున్న మాజీ సీఎం

అమెరికాకు కేసీఆర్ ఫ్యామిలీ! పాస్ పోర్టు రెడీ చేసుకున్న మాజీ సీఎం
  • ఈ నెల 16న వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత
  • 22వ తేదీ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా వెళ్లేందుకు  సిద్ధమవుతోంది. వివిధ పనుల మీద వాళ్లు అమెరికా వెళ్లనున్నారు. హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే కోసం గులాబీ బాస్ అమెరికా వెళ్లారని తెలుస్తోంది. ఇందుకోసం కేసీఆర్, తన సతీమణి శోభతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లారు.  డిప్లమాట్ పాస్ పోర్టును జనరల్ కేటగిరీకి మార్చుకున్నారు. ఆతర్వాత ఇటీవలే గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్ కు వెళ్లి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

కేటీఆర్ కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య ప్రస్తుతం అమెరికాలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. వాళ్లను చూసేందుకు, కొద్ది రోజుల పాటు గడిపేందుకు కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి అమెరికా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే హిమాన్షు గ్రాడ్యుయేషన్ డేకు వెళ్లారని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. అది సరికాదని హిమాన్షు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేందుకు ఇంకా సమయం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేసీఆర్ అమెరికా టూర్  పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

22 తర్వాత కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ నెల 22వ తేదీ తర్వాత అమెరికా వెళ్లబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాసెస్ దాదాపు పూర్తయింది. ఇటీవలే జిమ్ లో వర్కవుట్ చేస్తూ స్వల్పంగా గాయపడ్డ కేటీఆర్  ప్రస్తుతం రెస్టు లో ఉన్నారు. జూన్ 2వ తేదీన అమెరికాలో ప్రవాస తెలంగాణ వాసులు నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు.

16న ఎమ్మెల్సీ కవిత
ఈ నెల 16న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్లనున్నారు. తమ కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత దంపతులు హాజరుకానున్నారు. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో​ ఆమె ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. లిక్కర్ స్కాం కేసులో  నిందితురాలిగా  ఉన్న కవిత విదేశీ పర్యటన కోసం ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.

►ALSO READ | Lingampally Flyover: లింగంపల్లిలో తప్పిన ట్రాఫిక్ తిప్పలు.. అందుబాటులోకి BHEL జంక్షన్ ఫ్లైఓవర్