వరదలపై సమీక్షకు కేసీఆర్కు టైమ్ లేదా: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్

వరదలపై సమీక్షకు కేసీఆర్కు టైమ్ లేదా: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్

ప్రభావిత ప్రాంతాల్లో బ్రిడ్జిలు కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు 
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో వరదలతో పట్టణాలు, పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నా, ఇప్పటివరకు సీఎం కేసీఆర్​కు కనీసం సమీక్ష చేసే టైమ్​ దొరకలేదా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూర్ మండలంలో శుక్రవారం ఆయన పర్యటించి మాట్లాడారు. వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. సర్వం కోల్పోయిన కుటుంబాలకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే సహాయక చర్యలు అందించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్రిడ్జిలు కట్టిఉంటే ఇప్పుడీ దుస్థితి ఉండేది కాదన్నారు.

 సీఎం ప్రత్యేక నిధిలోని రూ.1,000 కోట్లతో  బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న సలుగుపల్లి వద్ద బాపుగూడ వాగును బురదలో నడుస్తూ పరిశీలించారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు సాయం చేయాలని బీఎస్పీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్​చార్జి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి,  కొండ రాంప్రసాద్, మండల అధ్యక్షుడు అత్రం సాయి  తదితరులు పాల్గొన్నారు.