రూ. 1000 కోట్లతో వరద బాధితులకు శాశ్వత కాలనీలు

 రూ. 1000 కోట్లతో వరద బాధితులకు శాశ్వత కాలనీలు

భద్రాచలం వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం.. రూ. 25 కేజీల బియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వరద ప్రభావానికి గురైన గ్రామాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించారు. అధికారులతో రివ్యూ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో ఎన్నడూ చూడని వరద వచ్చిందని, కడెం ప్రాజెక్టు పరిస్థితి ఇందుకు ఉదాహరణ అని అన్నారు. వరదలు వచ్చినప్పుడల్లా ముంపునకు గురికావడం బాధాకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 1000 కోట్లతో వరద బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరద బాధిత కుటుంబాల అధికారులు ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. పోచంపాడులో 7,274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం తరలించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 29వ తేదీ వరకు ప్రతిరోజు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందని, అందుకే బాధితులు అప్పటి వరకు సహాయక శిబిరాల్లానే ఉండాలని సూచించారు. ప్రమాదం ఇంకా తొలగిపోలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 

అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీట మునిగిన వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. ఉదయం భద్రాచలం చేరుకున్న ఆయన..  గోదావరి నదికి శాంతి పూజ చేశారు. కరకట్టను పరిశీలించిన అనంతరం భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసరాలు, వైద్యం సౌకర్యాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.