పాలమూరు రిజర్వాయర్లు.. ఆగస్టులో నింపుతం

పాలమూరు రిజర్వాయర్లు.. ఆగస్టులో నింపుతం
  • గండిపేట, హిమాయత్​సాగర్​కు గోదావరి లింక్​చేస్తం
  • మహేశ్వరం వరకు మెట్రో తెస్తం: కేసీఆర్
  • ‘పాలమూరు- రంగారెడ్డి’ 85% పూర్తయింది
  • కనీవినీ ఎరుగని స్కీమ్​లు తెచ్చినం
  • మళ్లీ మేమే గెలుస్తం.. నాకు డౌట్​ లేదు
  • రాష్ట్రంలో  7.7% పచ్చదనం పెరిగిందని వ్యాఖ్య
  • రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో హరితోత్సవం

రంగారెడ్డి, వెలుగు: పాలమూరు – -రంగారెడ్డి ఎత్తి పోతల కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటే పూర్తి కావాల్సిందని, వాటి కోసం రిజర్వాయర్లన్నీ కట్టామని, ఆగస్టులో వాటిని నింపుకోబోతున్నామని సీఎం కేసీఆర్​ చెప్పారు. చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టామని అన్నారు. మళ్లీ తామే గెలుస్తామని, అందులో తనకు డౌట్​ లేదని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు రిజర్వు ఫారెస్ట్ కేంద్రంలో ఏర్పాటుచేసిన హరితోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులేనని దుయ్యబట్టారు. 

‘‘సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చి పనులు ఆగెటట్టు చేసిన్రు. ఏదేమైనా భగవంతుని దయవల్ల ప్రాజెక్టు పనులు దాదాపు 85 శాతం పూర్తయినయ్. మహేశ్వరం, ఇబ్రహీం పట్నం, వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. రాబోయే మూడు నాలుగు నెలల్లో మీరు మార్పును చూడబోతున్నరు” అని ఆయన తెలిపారు. ‘‘మీకో తీపి కబురు చెప్తున్న.  కృష్ణా నదిలో నీళ్ల కోసం పంచాయితీ ఉంది. కానీ గోదావరి నదికి లేదు. గోదావరి నీళ్లు హిమాయత్ సాగర్, గండిపేట వరకు లింక్ కాబోతున్నయ్​. అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా ఇక్కడి ప్రాంతాలకు కూడా గోదావరి నీళ్లిచ్చే అవకాశం ఉంది. కిం దనే కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీ నది నీళ్లు దాటిస్తే దాదాపు లోయపల్లి దాకా వస్తయ్​. దీన్ని కూడా పరిశీలిస్తున్నం. కృష్ణాలో నీళ్లు తక్కువబడి నా, గోదావరి నుంచైనా ఇస్తం. మీరు చింతించాల్సిన అవసరం లేదు” అని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. 

ఉచితంగా పండ్ల మొక్కలు

ఈ ఏడాది నుంచి ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడానికి రూ. 100 కోట్ల బడ్జెట్ పెట్టాలని సీఎస్​కు చెప్పినట్లు కేసీఆర్​ తెలిపారు.  ఇది కూడా ప్రారంభమవుతుందని అన్నారు. ‘‘పచ్చదనం ఎక్కడివరకు ఉంటే అక్కడి వరకు తెలంగాణ రాష్ట్రమని పేరొచ్చింది. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హరితహారంపై జోకులు వేసిన్రు. తెలంగాణలో ఈ రోజు 7.7 శాతం పచ్చదనం పెరిగింది. ఇదేదో మాటలు చెప్తే పెరగదు. తమాషాలు, కథలు చెప్తే కాదు.  అటవీ అధికారులు బాగా కృషి చేశారు. కానీ నేను అందరికంటే ఎక్కువగా గ్రామ సర్పంచుల్ని అభినందిస్తున్న.  నేను చట్టం తెచ్చినప్పుడు వాళ్లందరికి కూడా నా మీద కొంచెం కోపం వచ్చింది. కానీ ఆ చట్టం స్ఫూర్తితోనే ఇప్పుడు గ్రామాలు పచ్చగున్నయ్​. రోడ్ల మీద పోతుంటే ఎటు చూసినా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నయ్. ఇది వట్టిగా జరిగేది కాదు” అని కేసీఆర్​ పేర్కొన్నారు. ఫారెస్టు అధికారులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ స్టేషన్లతో పాటు సాయుధ సాయం అందిస్తామని, ఇందు కోసం 20 వరకు స్టేషన్లు అవసరమవుతాయని ఆయన అన్నారు. 

మహేశ్వరానికి వరాలు

మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్​ కాలేజీ ఇస్తామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. ‘‘మహేశ్వ రం మండలం తుమ్మలూరు వద్ద సబ్​ స్టేషన్​ ఏర్పా టు చేస్తం. గ్రామానికి కమ్యూనిటీ హాల్ కోసం రూ.కోటి మంజూరు చేస్తున్నం. దానికి దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని పేరు పెట్టాలి. మహేశ్వరం సెగ్మెంట్​ పరిధిలోని 65 గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్ కోసం వెంటనే జీవో జారీ చేస్తం” అని తెలిపారు. జల్​పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు చెరో రూ.25 కోట్లు, బడంగ్ పేట, మీర్ పేట మున్సిపాలిటీలకు చెరో రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు.  ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రోకు ఈ మధ్యే అడుగులు పడ్డాయని తెలిపారు. 

మహేశ్వరం, కందుకూరు వరకు మెట్రో వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు సంతోష్ , రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం, విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్​అధికారి శ్రీనివాస్​ రావు భార్యకు ఉద్యోగ నియామక పత్రం, 500 గజాల ఇంటి జాగా, పరిహారాన్నిసీఎం అందజేశారు.