రాజీపడని రాజకీయం ఏమాయె?

రాజీపడని రాజకీయం ఏమాయె?

ప్రవీణ్​కుమార్​ హఠాత్తుగా కేసీఆర్​తో కలిసి బీఎస్పీ పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు  ప్రజల జీవితాలను బాగు చేసేందుకేనని చాలా ఉత్సాహంగా  మీడియా ముఖంగా ప్రకటించారు. దేశంలో లౌకికవాదం ప్రమాదంలో ఉందని, బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ కూడా బీజేపీలాగే ప్రవర్తిస్తోందని ఆరోపించారు. లౌకికవాదాన్ని నిరంతరం కాపాడిన నేత కేసీఆర్ మాత్రమేనని, అందుకే ఆయనతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారట! మాయావతితో కేసీఆర్ మాట్లాడి  సీట్ల సర్దుబాటు చేసుకుంటారని చెప్పారు.

మొన్నటిదాకా బీఆర్​ఎస్​పై తీవ్ర విమర్శలు చేసి, ఇపుడు పొత్తు పెట్టుకోవడంపై అడిగిన ప్రశ్నలకు జవాబు దొరకక, విమర్శలు అలాగే  ఉంటాయంటూ ముక్తసరి జవాబిచ్చారెందుకు?  అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు,  ప్రవీణ్ సుదీర్ఘం మౌనం, అకస్మాత్తుగా కేసీఆర్​తో పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపై  రాష్ట్ర ప్రజలు నిర్ఘాంతపోయిన మాట వాస్తవం. ఈ  అపవిత్ర  పొత్తు క్రమం ఏమిటో పరిశీలిద్దాం.

కేసీఆర్​ అవినీతిపై చేసిన విమర్శలన్నీ  భూటకమేనా?

ప్రవీణ్​కుమార్​ఐపీఎస్​కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేసీఆర్ నియంతృత్వ పాలనపై చేసిన యుద్ధమంతా వట్టిదేనా? ఓట్లు చీల్చడం కోసమేనా? బీఆర్ఎస్ పార్టీ అన్యాయాలను అక్రమాలను అన్ని విధాలా ఎండగట్టడం ఒక నటననేనా? ప్రవీణ్​ వెనక నిలబడ్డ ప్రజలకు ఆయనిచ్చే బహుమానం, సామూహిక వంచనేనా? కాళేశ్వరం ప్రాజెక్టు, భగీరథలో భారీ అవినీతిపై, దళితులపై దౌర్జన్యాలను, అన్యాయాలను విమర్శించటం  బూటకమేనా? లక్షలాది మంది యువత, వారి కుటుంబాల భవిష్యత్తును, బలి చేసిన పేపర్ లీకులపై పోరాటంలో నిరుద్యోగుల తరఫున నిలబడడం, ఓట్లు చీల్చి కేసీఆర్​ను గెలిపించడం కోసం బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులయ్యారా? నాటి నుంచి నేటి అపవిత్ర పొత్తు వరకు అయిన ఖర్చు ఎన్ని కోట్లు?.

దగా పడ్డ బహుజనులు

చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం దిశవైపే నా ప్రయాణమన్నారు. సామాజిక న్యాయం అంటే, రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా నాశనం చేసిన కేసీఆర్​కు న్యాయమా? తెలంగాణ వినాశనంలో సమిధలైన బహుజనులకా? ప్రజలకు చెందాల్సిన ఖజానాను (సామాజిక న్యాయాన్ని) అడుగుముట్ట విధ్వంసం చేశారు.  బీఆర్ఎస్​తో బీఎస్పీ పార్లమెంటు ఎన్నికల్లో  పొత్తుకు సామాజిక న్యాయం సిగ్గుపడి తలదించుకుంది. కేసీఆర్ అవినీతి, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో బతుకు విధ్వంసమైన బహుజనుల స్వేచ్ఛ స్వాతంత్రం వారి జీవితాల్లో మరింత దూరమైంది. కేసీఆర్ పాలనలో దగా పడ్డ బహుజనులు దృఢంగా నిర్ణయించుకున్నందునే ప్రగతి గడీల నుంచి నియంతను గద్దె దించారు.

మంచి అధికారిగా భావించి నమ్ముతూ  వెన్నంటి ఉన్న ఆ వర్గాలకు ఈ అపవిత్ర పొత్తు వంచన కాదా? బతకడానికి దళితులకు ఏనాడో  ఇచ్చిన అసైన్మెంట్ భూములను పోలీసులను పెట్టి గుంజుకున్న  బీఆర్ఎస్  నేతలపై తిరగబడ్డ  దళితులకు పొత్తుతో  బోధించే మీ సామాజిక న్యాయం ఏమిటి? దళిత బంధు బీఆర్ఎస్ నేతల అవినీతి బంధుగా మారిందని, దళిత బంధు నేతల 40 శాతం అవినీతి  బంధువు అయిందని స్వయంగా ప్రకటించిన కేసీఆర్​తో పొత్తుతో దళితులకు న్యాయం చేస్తారా?  

అభిమానుల్లో కన్నీళ్లు

రేపటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​  ఎంపీ సీట్లే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైతే, కేసీఆర్ ఎవరికి మద్దతు ఇస్తారు? ఎవరైనా  కళ్ళు మూసుకుని చెబుతారు బీజేపీకే అని! నిరంతర లౌకిక వాదైన కేసీఆర్ రేపు ఎవరి ఒడిలో ఒదిగిపోతారో కూడా తెలియనంత అమాయకుడా ప్రవీణ్?.  మా మార్గదర్శకుడని, మా ఆధునిక అంబేద్కర్,  ఫూలే  అని నమ్మి వెన్నంటి, ఆర్​ఎస్​పీ పార్టీ బీఎస్పీ గెలుపు కోసం జీవన్మరణ  పోరాటం చేసిన, ఆ ప్రజలకు మారు మాటైనా చెప్పకుండా,  ఏకపక్షంగా, రాత్రికి రాత్రి ద్రోహం, ఘోరమైన వంచనకు గురిచేయడం న్యాయమా? ఈ విషాదం మాటల్లో చెప్పలేనిది. ఆర్ఎస్పీ అభిమానులను కదిలిస్తే నేడు కన్నీళ్లు పెడుతున్నారు. దేవుడిలా భావించినవారే, ఆర్ఎస్పీని అగౌరవంగా సంబోధిస్తున్నారు.

బీఎస్పీ, బీఆర్​ఎస్​ అపవిత్ర పొత్తు

పాలకవర్గాల బహుజన రాజకీయాలు ఓ బూటకం. బహుజనులను వంచించడమే వాటి లక్ష్యం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కేసీఆర్​కు దోపిడీ లక్ష్యం ఉన్నట్టు, నాటి పోరాట సంఘాలకు, ఆర్ఎస్​పీ  వంటి నేతలకు  రాజీపడని ఒక రాజకీయ కార్యాచరణ లేదు.  కేసీఆర్​ను నమ్మడం వల్లే ఈ వినాశనం సంభవించింది. బీఎస్పీ  ప్రవీణ్ బహుజన రాజకీయాలు కూడా కేసీఆర్​ తెలంగాణ రాజకీయాలకు భిన్నమైనవి కావు.  బీఎస్పీ, బీఆర్ఎస్ అపవిత్ర పొత్తు  బ్రష్టు పట్టిన బహుజన రాజకీయాలకు పరాకాష్ట. దశాబ్దాలుగా నమ్మిన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, సీతాకోకచిలుక నుంచి గొంగళి పురుగుగా మారిన ఈ  అపవిత్ర పొత్తు గుట్టు దాగేదేనా?  ప్రజాభిప్రాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకునే ఏ నాయకుడూ రాజకీయంగా ఎదిగిన దాఖలా లేదు. ఆ విషయం ఆర్ఎస్​పీకి గుర్తుచేయాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు. 

ఓట్లు చీల్చే పాత్రేనా?

దేశంలో  బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని,  లౌకికవాదం ప్రమాదంలో ఉందన్నారు ప్రవీణ్.  అవినీతి కేసులకు భయపడి బీఎస్పీ అగ్రనేత మాయావతి దేశమంతా నిజమైన ప్రతిపక్షంగా పనిచేయడం ఎప్పుడో మానేసింది.  ప్రస్తుతం తెలంగాణలో బీఎస్పీ కార్యాచరణ అంతా ఓట్లు చీల్చి బీజేపీ సేవలో తరిస్తూ నిరంతర లౌకికవాది కెసిఆర్​ను బలపరచడమే కదా!  అంతిమంగా బీజేపీని ఉద్ధరించే  బీఎస్పీ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు.  నిరంతర లౌకికవాదైన కేసీఆర్, రాష్ట్రపతి ఎన్నికల్లో, నోట్ల రద్దులో, మోదీ తెచ్చిన వ్యవసాయ చట్టాలకు కేసీఆర్​ మద్దతు ఇచ్చిన విషయం ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు.  ప్రతిగా  భారీ అవినీతికి కాళేశ్వరం, భగీరథల జనకుడైన లౌకికవాదిని, మోదీ మంత్రులే ఆహో ఓహో అని ప్రశంసించి రక్షించారు. ఆయనతో జత కట్టిన ప్రవీణ్ కుమార్​ను ఏమనుకోవాలో?

వ్యక్తిగత కాంక్ష 

కేసీఆర్ బీఆర్ఎస్ పాలనపై ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ రాజీలేని పోరాటం చేసి అకస్మాత్తుగా  కేసీఆర్ ఒడిలో ఎందుకు ఒదిగిపోయారని అభిమానులు, మద్దతుదారులు ఆవేశంతో, కొందరు కన్నీళ్ళతో అడుగుతున్నారు.  వారికి ఆయన జవాబు చెప్పగలరా?.  వెంట నడిచిన వారందరినీ  సామూహికంగా వంచనకు గురిచేశారు. విలువలను విడమర్చి, ఎలాగైనా ఎంపీగా గెలవాలనే  వ్యక్తిగత  కాంక్షకోసం,  అందునా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విధ్వంసం చేసిన 
 కేసీఆర్​తో పొత్తును బహుజనులు జీర్ణించుకోలేకపోతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్​కు ఓట్లేసి జీవన్మరణ పోరాటం చేసిన జనానికి  ఏం చెపుతారు?  కొద్దో గొప్పో విలువలున్నాయని నమ్మి వెన్నంటి ఉన్నోళ్లకు నమ్మకద్రోహంతో మంచి గుణపాఠం నేర్పారు. బీఎస్పీ క్యాడర్​కు ఏం జవాబుచెపుతారు?. 

-  నైనాల గోవర్ధన్