నాలాంటోడ్ని పోగొట్టుకోవద్దు..దళితుల గురించి ఆలోచించే నాయకులు రారు: కేసీఆర్

నాలాంటోడ్ని పోగొట్టుకోవద్దు..దళితుల గురించి ఆలోచించే నాయకులు రారు: కేసీఆర్
  •     దళితబంధు ఎన్నికల కోసం పెట్టిన స్కీమ్​ కాదు
  •     రాహుల్​ గాంధీకి ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదు 
  •     ఓట్లయిన తెల్లారే సత్తుపల్లిలో దళితబంధు
  •     డబుల్​ రోడ్డు ఉంటే తెలంగాణ.. సింగిల్​ రోడ్డుంటే ఆంధ్రా
  •     సత్తుపల్లి, ఇల్లందు సభల్లో కామెంట్స్​

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘‘దళిత సమాజం కోసం మంచి చేసే, దళితుల వికాసాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే కేసీఆర్​ లాంటి నాయకుడిని పోడగొట్టుకోవద్దు” అని సీఎం కేసీఆర్​ అన్నారు. తనలాంటి నాయకులు రారని, దళితుల గురించి ఇట్లాంటి మేలు ఎవరూ చేయలేదని చెప్పారు. ధైర్యం చేసి దళితబంధు అమలు చేస్తున్నామని, బీఆర్ఎస్​ను మళ్లీ గెలిపించాలని ఆయన కోరారు. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఇల్లందులో నిర్వహించిన సభల్లో కేసీఆర్​ మాట్లాడారు. 
 
అభివృద్ధి విషయంలో ఖమ్మం ప్రజలకు తాను చెప్పాల్సిందేమీ లేదని, ఎవరితో విడిపోయామో వాళ్ల రోడ్లు, మన రోడ్లు చూస్తే తెలుస్తుందన్నారు.  నిత్యం ఏపీకి వెళ్లి వచ్చే ఖమ్మం ప్రజలకు.. డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ, సింగల్​రోడ్డు వచ్చిందంటే ఆంధ్రా అనేది కనబడుతున్నదని కేసీఆర్​అన్నారు. విడిపోతే మీకు పాలన చేతకాదు, ఆగమైతరని అన్నవారు చీకట్లో ఉంటే.. తెలంగాణ ప్రజలు వెలుగు జిలుగుల మధ్య ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏర్పడేది దళారుల రాజ్యమేనని విమర్శించారు. ‘‘ధరణి తెచ్చిన తర్వాత ప్రజల భూముల మీద అధికారుల పెత్తనం పోయింది. కాంగ్రెసోళ్లకు ఏం తెలుసు. రాహుల్ గాంధీకి ఎద్దు ఎరుకనా, ఎవుసం ఎరుకనా. ఎప్పుడైనా నాగలి పట్టి ఎవుసం చేసిండా. ధరణిని తీసేస్తానని మాట్లాడుతున్నడు. ఎవరో రాసిచ్చింది చదివి చెప్తున్నడు. కాంగ్రెస్ కు ఓటేస్తే దళారులు, పైరవీకారుల రాజ్యం వస్తది. కేసీఆర్ కు తెలివిలేదని, రైతు బంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు. మూడు గంటల కరెంటు ఇస్తే చాలని పీసీసీ అధ్యక్షుడు అంటున్నడు. కర్నాటక నుంచి ఒక పెద్దాయిన వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నడు. కర్నాటకలో ఐదు గంటలు కరెంటు ఇస్తున్నం, బస్సు పెట్టి తీసుకెళ్లి చూపిస్తరా అని అంటున్నాడు. అరే సన్నాసి మేము 24 గంటల కరెంట్​ఇస్తున్నం అని చెప్పిన. కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాం, రాం.. దళితబంధుకు జై భీమ్. ధరణి ఉండాల్నా, పోవాల్నా అనేది ఆలోచించుకోని ఓటెయ్యాలి”అని కేసీఆర్ అన్నారు. 

మరోసారి తుమ్మల, పొంగులేటిపై విసుర్లు

బహురూపుల నాయకులు అంటూ పాలేరులో విమర్శలు చేసిన సీఎం కేసీఆర్, మరోసారి సత్తుపల్లి మీటింగ్ లోనూ తుమ్మల, పొంగులేటిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఆరునూరైనా గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇక్కడ ఈ జిల్లాలో ఒకరిద్దరు కర్కాటక దమనకులున్నరు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఏ ఒక్కడ్ని కూడా అసెంబ్లీ వాకిలి తొక్కనియ్య అంటడు. ఎంత అహంకారం. తెలంగాణ తెచ్చిన వ్యక్తిని నేను కూడా ఇంత అహంకారంతో మాట్లాడను. నాలుగు పైసలు జేబులోకి రాగానే ఇంత అహంకారమా. ఇంత మదమా, ఈ డబ్బు రాజకీయాలు, అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు సాగుతాయి. పైసలు పంచుడు, గడియారాలు పంచుడు, ఇది కాదు రాజకీయం. ఎవనికి కావాలి నీ 60, 70 రూపాయల గడియారాలు. ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు, పార్టీ ల మధ్య పోరాటం. మీరు తలుచుకుంటే దుమ్ములెవ్వదా? సత్తుపల్లి పహిల్వాన్ లాగా సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో అడుగుపెట్టడా. కూరగాయల్లో పుచ్చు ఉంటే ఏరేయమా? కుండను కొనేటప్పుడు కొట్టి చూడమా..? అట్లనే వాళ్లని ఏరెయ్యాలి. కులం వాడు పోటీ చేస్తుండని, కులపోడు చెప్పిండని ఓటేయొద్దు. స్వశక్తితో ఆలోచించి ఓటు వేయాలి. ఫాల్తుగాళ్లు ఉన్నన్ని రోజులు దేశం బాగుపడదు”అని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

ఆగం కావొద్దు

సత్తుపల్లిలో 70, 80 వేల మెజారిటీతో వెంకట వీర య్య గెలుస్తారని  కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘కార్య కర్తగా ఎదిగి, ప్రజల కోసం పోరాడే వ్యక్తి వెంకట వీరయ్య. నియోజకవర్గం నుంచి సమస్య ఉందని ఎవరు ఫోన్ చేసినా అక్కడ పక్షిలాగా వాలిపోతాడు. 108 అయినా ఆలస్యం అయితది కానీ, మీ ఎమ్మెల్యే ఆలస్యం కాడు. తెలంగాణ వచ్చిన తర్వా త నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగిందో మీకు తెలుసు. ఏపీ బోర్డర్​లో ఉన్నరు. డబుల్ రోడ్డు ఉంటే తెలంగా ణ, సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ అని అంటున్నారు. విభజనకు ముందు చివరి సీఎం ఒకాయన ఉండే. విడిపోతే మీకు పాలన చేతకాదు, ఆగమైతరని అన్నడు. ఇప్పుడు తెలంగాణ వెలుగు జిలుగుల మధ్య ఉన్నాం. వాళ్లే చీకట్లో ఉన్నరు. ఎన్నికల సమయంలో ఎల్లయ్య, పుల్లయ్య వస్తారు. వాళ్ల చరిత్ర, కార్యదక్షత చూడాలి తప్ప, ఎవరో చెప్పిండని ఆగం కావద్దు. వెంకటవీరయ్య లాంటి నాయకులను పోగొట్టుకోవద్దు. ఆయన్ను గెలిపించి సత్తుపల్లి సత్తా చాటాలి” అని అన్నారు.

ఏడాదిలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాణం లాంటి సీతారామ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘‘సీతారామ ప్రాజెక్టు పాత ఖమ్మం జిల్లాకు వరప్రదాయని కానుంది. ప్రాజెక్ట్ పూర్తయితే 3 పంటలు పండుతాయి. జిల్లాలో బలుపు రాజకీయాలు చేసిన నాయకులు ఉన్నారు. వాళ్లకు ఎప్పుడైనా సీతారామ ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచనా వచ్చిందా?. హరిప్రియ కోరిక మేరకు ఎత్తు ప్రాంతాలకు లిఫ్టులు తెచ్చిచ్చే బాధ్యత నాది. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లందులో ఒక రోజు ఉండి ఇక్కడి సమస్యలన్నీ తీరుస్త. కాంగ్రెస్​ వస్తే వాళ్ల స్విచ్చులన్నీ ఢిల్లీ పెద్దల చేతులో ఉంటాయి. మా పార్టీల మేమే బాసులం. ప్రజలకు మేలు చేసే వాళ్లను మంచి మెజార్టీతో ఆదరించాలి”అని కేసీఆర్​ కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీకి పిచ్చి

ప్రధాని మోదీకి పిచ్చి, అహంకారం ఉందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ‘‘మోదీ అన్నీ ప్రైవేట్ పరం చేయాలని పిచ్చిగా పోతున్నడు. ఎల్ఐసీ, రైల్వే, ఎయిర్ పోర్టులు, పోర్టులు అన్నీ ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తున్నడు. విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాడు. రాష్ట్రంలో మేం పెట్టిన అన్ని థర్మల్ విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలో పెట్టినం. ఒక్క మెగావాట్ కూడా ప్రైవేట్ కు ఇవ్వలేదు” అని కేసీఆర్ చెప్పారు.

దళితబంధు పుట్టిందే అక్కడ..!

సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళితబంధు ఆలోచన వచ్చిందని కేసీఆర్ చెప్పారు. “ మేం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని స్కీములు వంద అమలు చేస్తున్నం. దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరు.?  కొందరు దుర్మార్గులు ఓట్ల కోసం దళితబంధు స్కీమ్ తెచ్చిన్నని ప్రచారం చేస్తున్నరు. దళిత బంధు పెట్టిన నాడు ఎన్నికలు లేవు, మన్ను లేవు. దేశంలో ముందున్న నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా దళితులు వెలివాడల్లోనే ఉన్నరు. ఎన్ని జెండాలున్న ప్రభుత్వాలు వచ్చినా దళితులకు ఏ పార్టీ ఏం చెయ్యలే. కేవలం ఓటు బ్యాంకు లాగనే వాడుకున్నరు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడే దళిత చైతన్య జ్యోతి అని కార్యక్రమం పెట్టిన. దళిత బంధుకు అదే స్ఫూర్తి. దళితబంధును ఓట్ల కోసం తెచ్చారనే ప్రచారం జరుగుతోందని ఎంపీ పార్థసారథి రెడ్డి నాతో చెబుతూ బాధపడ్డడు. దళితబంధు ఓట్ల కోసం తెచ్చినమా? దళిత సమాజం కోసం మంచి చేసే, దళితుల వికాసాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే కేసీఆర్​లాంటి నాయకుడిని పోడగొట్టుకోవద్దు. ఇట్లాంటి నాయకులు మళ్లీ రారు. భట్టి విక్రమార్క అడగక పోయినా, ఆయన నియోజకవర్గం చింతకాని మండలంలో 100 శాతం పైలెట్ ప్రాజెక్టు కింద పెట్టిన. ప్రతిపక్ష ఎమ్మెల్యే అడగకున్నా, పథకాన్ని ఎస్సీ నియోజకవర్గంలో అమలు చేసినం. అది మా నిజాయితీకి గీటురాయి. మాకు సంకుచిత రాజకీయం చేసే అలవాటు లేదు. వందశాతం వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరి తాతజేజమ్మ దిగొచ్చినా ఆపలేరు. ఓట్లయిన తెల్లారి మొదటిరోజు నుంచే సత్తుపల్లిలో దళితులందరికీ పథకాన్ని అమలు చేస్తం”అని కేసీఆర్ చెప్పారు. 

హరిప్రియ నా బిడ్డలాంటిది..

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తనకు బిడ్డలాంటిదని కేసీఆర్ అన్నారు. ‘‘ఇల్లందు పోరాటా ల పురిటిగడ్డ. నియోజకవర్గంలో మంచినీళ్లకు ఘోరమైన అవస్థ ఉండేది. ఇప్పుడు గుండాల లాంటి అటవీ ప్రాంతంలో కూడా త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నం. ఎమ్మెల్యే చొరవతో గ్రామాల్లో వందల కోట్ల అభివృద్ధి జరిగింది. హరిప్రియా నాయక్ హయాంలో పోడు రైతులకు 48 వేల ఎకరాలను భూములకు పట్టాలు అందించాం. పట్టాలతో పాటు రైతు బంధు ఇచ్చాం, రైతు బీమా అమలు చేస్తున్నం. హరిప్రియా కోరిక మేరకు కొమరారం మండలంగా, ఇల్లందును రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేస్తాం. పైసలకు, ప్రలోభాలకు ఓటు వేయకుండా నిజాయితీతో ఆలోచించి ఓటేయండి” అని సీఎం సూచించారు.