తెలంగాణకు కంచుకోట టీఆర్ఎస్

తెలంగాణకు కంచుకోట టీఆర్ఎస్

దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందని సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటిస్తున్న ఫ‌లితాలు, అవార్డులు, రివార్డులే మ‌న ప‌నితీరుకు మ‌చ్చుతున‌క అని అన్నారు. దేశంలో అతి ఉత్త‌మమైన‌టువంటి గ్రామాల్లో తొలి పది స్థానాల్లో తెలంగాణ‌కు చెందినవే నిలిచాయని, ఈ విష‌యాన్ని కేంద్ర‌ ప్రభుత్వమే స్వ‌యంగా ప్ర‌క‌టించిందన్నారు. టీఆర్ఎస్ ప‌నితీరుకు ఇది మ‌చ్చుతున‌క అని చెప్పారు. కేంద్రం నుంచి అవార్డు రాని డిపార్ట్‌మెంట్  అంటూ తెలంగాణ‌లో లేద‌ని చెప్పారు. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు కేసీఆర్. 80 శాతం మంది ప‌రిపాల‌న భాగ‌స్వాములుగా ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌తో,  60 ల‌క్ష‌ల మంది స‌భ్యుల‌తో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు క‌లిగి ఉన్న పార్టీ టీఆర్ఎస్ అని కేసీఆర్ తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్ట‌ని కోట‌ అని.. ఎవ‌రూ బ‌ద్ద‌లు కొట్ట‌లేని కంచుకోట అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి తప్ప ఒక వ్య‌క్తిదో, శ‌క్తిదో కాదన్నారు. అనుక్ష‌ణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను, ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే కాప‌లాదారు టీఆర్ఎస్ పార్టీ అని సీఎం పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ జల భాండాగారంగా రూపుదిద్దుకుటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ పసిడి పంటలతో విరాజిల్లుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిందని చెప్పారు.

విద్యుత్ రంగంలో అద్భుత ఫలితాలు 

విద్యుత్ రంగంలో దేశ‌మంతా కారు చీక‌ట్లు క‌మ్ముకున్న వేళ‌లో వెలుగు జిలుగుల తెలంగాణ‌ను ఏర్పాటు చేసుకున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. అన్నిరంగాల్లో అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నామన్నారు. ఇవాళ దేశంలో స్థాపిత విద్యుత్ శ‌క్తి సామ‌ర్థ్యం.. 4,01,035 మెగావాట్ల అందుబాటులో ఉంద‌ని సీఎం తెలిపారు. అందుబాటులో ఉన్న విద్యుత్ ను  వినియోగించ‌లేని ప‌రిస్థితిలో ఈ దేశం ఉందన్నారు. 4 ల‌క్ష‌ల మెగావాట్ల విద్యుత్ శ‌క్తి ఉన్న‌ప్ప‌టికీ.. 2 ల‌క్ష‌ల‌కు మించి వాడ‌టం లేదన్నారు. ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్ర‌మైన‌ గుజ‌రాత్‌లో కూడా క‌రెంట్ కోత‌లు ఉన్నాయని, పంట‌లు ఎండిపోతున్నాయని చెప్పారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా క‌రెంట్ కోతలు ఉన్నాయన్న కేసీఆర్.. చుట్టూ అంధ‌కారం ఉంటే తెలంగాణ ఓ మ‌ణిద్వీపంలా వెలుగుతున్న‌దని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఏడేండ్ల క్రితం వరకు తెలంగాణ సైతం క‌రెంట్ కష్టాలు ఎదుర్నీకొన్నా ఇప్పుడా స‌మ‌స్య‌ను అధిగ‌మించి వెలుగు జిలుగుల తెలంగాణ‌గా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. తెలంగాణ‌లా దేశం ప‌ని చేసి ఉంటే.. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ముంబై నుంచి కోల్‌క‌తా వ‌ర‌కు 24 గంట‌ల క‌రెంట్ ఉండేదని సీఎం అన్నారు .