ధరణి పోర్టల్​ గరీబుల కోసమే..వారి ఆస్తులు సేఫ్

ధరణి పోర్టల్​ గరీబుల కోసమే..వారి ఆస్తులు సేఫ్
  • వారి ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతది
  • ప్రతి అంగుళం ఆస్తిని ఆన్​లైన్​లో నమోదు చేస్తం
  • క్రమబద్ధీకరణ సొమ్ముతో ఖజానా నింపుకోవాలని చూస్తలేం
  • గూండాగిరీ, భూ కబ్జాలు, వేధింపులు తగ్గినయ్​: సీఎం
  • కొత్త చట్టాల అమలు కోసం శ్రమించాలని లీడర్లు, ఆఫీసర్లకు సూచన

హైదరాబాద్‌‌, వెలుగుగరీబుల కోసమే ధరణి పోర్టల్‌‌ తీసుకువస్తున్నామని, దీని ద్వారా పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుందని సీఎం కేసీఆర్‌‌ అన్నారు.
వ్యవసాయ భూములకు గ్రీన్​, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌‌ కలర్​ పాస్‌‌ బుక్కులు ఇస్తామని, రాష్ట్రంలోని ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ల పరిధిలో ఇండ్లు, ప్లాట్లు, అపార్ట్‌‌మెంట్లలోని ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్‌‌లైన్‌‌ చేయడంపై సీఎం గురువారం ప్రగతి భవన్‌‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశమయ్యారు. పేదల భూముల క్రమబద్ధీకరణతో వచ్చే పైసలతో తమ ప్రభుత్వం ఖజానా నింపుకోవాలని  చూడటం లేదని సీఎం కేసీఆర్​ అన్నారు. ధరణి వెబ్‌‌సైట్‌‌ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకునేలోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని ఆఫీసర్లను ఆయన ఆదేశించారు.

రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లో భూముల ధరలు పడిపోతాయని కొందరు శాపాలు పెట్టారని, వారి అంచనాలను తలకిందులు చేస్తూ వ్యవసాయ, వ్యవసాయేత భూములకు డిమాండ్‌‌ పెరుగుతూ వచ్చిందని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. సుస్థిర పాలనతో భూకబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గూండాగిరీ తగ్గిందని ఆయన చెప్పారు. దేశం నలుమూలల నుంచి మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు హైదరాబాద్‌‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారని, ఆలయాలు నిర్మించుకొని స్వేచ్ఛగా తమ సంస్కృతిని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువుతో అల్లాడిన ఊళ్ల నుంచి ప్రజలు హైదరాబాద్‌‌కు వచ్చి స్థిరపడ్డారని చెప్పారు. నిరుపేద ముస్లింలు ఓల్డ్‌‌ సిటీలోనే కాకుండా న్యూసిటీలోని చాలా ప్రాంతాల్లో ఉన్నారని, పేదరికానికి కులం, మతం లేదని.. కులమతాలకు అతీతంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం అన్నారు.  ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపించారని, వారి గుండె తీసి తమ చేతుల్లో పెట్టారని, వారి కోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉందని సీఎం కేసీఆర్​ అన్నారు. నోటరీ, జీవో 58, 59 ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారుల స్థలాల రెగ్యులరైజేషన్‌‌కు మరో అవకాశమిచ్చామని
చెప్పారు.

ఆస్తుల వివరాలు ఆన్​లైన్​లో అప్​డేట్​ చేయాలి

ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరుగుతూ ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి ఆన్‌‌లైన్‌‌లో పొందుపరిచేలా చూడాలని ఆయన ఆదేశించారు. భూములు, ఆస్తులకు సంబంధించిన పూర్తి సమచారం ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌డేట్‌‌ చేయాలన్నారు. ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త చట్టాల అమలతో ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకూడదన్నది, చివరి గుడిసె వరకూ ప్రయోజనం కలిగిలే చూడాలన్నదే  తమ లక్ష్యమని చెప్పారు. నూతన చట్టాల అమలు కోసం ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు 24 గంటలూ శ్రమించాలన్నారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్‌‌, మహమూద్‌‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌‌యాదవ్‌‌, దయాకర్‌‌రావు, ప్రశాంత్‌‌రెడ్డి, మల్లారెడ్డి, కమలాకర్‌‌, అజయ్‌‌, డిప్యూటీ స్పీకర్‌‌ పద్మారావుగౌడ్‌‌, ఎంఐఎం ఎల్పీ లీడర్‌‌ అక్బరుద్దీన్‌‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.