కేసీఆర్ ను జైలుకు పంపిస్తం– బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

కేసీఆర్ ను జైలుకు పంపిస్తం– బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

అప్పటి వరకూ బీజేపీ పోరాటం ఆగదు -బండి సంజయ్

సీఎం అవినీతిని ఆధారాలతోపాటు బయటపెడ్తం

రాష్ట్రంలో అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన

హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్నరు

సెప్టెంబర్ నెలంతా జనంలోనే..

బీజేపీ ఉద్యమ కార్యాచరణ

పార్టీ స్టేట్ ఆఫీస్ బేరర్ల మొదటి మీటింగ్ లో పలు నిర్ణయాలు

గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి

 జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు వస్తుండటంతో ఇప్పుడు కేసీఆర్ హామీలు గుప్పిస్తున్నారు. కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల సీఎంల నాటకాన్ని ప్రజల ముందు నిలదీస్తాం. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేంద్రానికి నివేదించాం. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పినందున ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూడాలి.– బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నడుస్తోందని, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలు, బంధుప్రీతిని సాక్ష్యాధారాలతో పాటు నిరూపిస్తామని, ఆయనను జైలుకు పంపే వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు. హిందువులకు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆయన తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సీఎంకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల మొదటి సమావేశం సంజయ్ అధ్యక్షతన వర్చువల్ మోడ్ లో జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సౌధాన్ సింగ్, రాష్ట్ర పార్టీ ఇన్ చార్జ్​ కృష్ణదాస్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, రాంచందర్ రావు, మంత్రి శ్రీనివాసులు, ప్రేమేందర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నిత్యం జనం మధ్యే ఉండాలి: సంజయ్

ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగుతున్న కేసీఆర్ పాలనపై ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని ఆఫీస్ బేరర్లకు సంజయ్ దిశానిర్దేశం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నిత్యం జనంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వచ్చే నెలంతా ఉద్యమ కార్యాచరణ అమలులోనే గడపాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరే షన్ల ఎన్నికలు వస్తుండటంతో ఇప్పుడు కేసీఆర్ హామీలు గుప్పిస్తు న్నారని సంజయ్ ఆరోపించారు. కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల సీఎంల నాటకాన్ని ప్రజల ముందు నిలదీస్తామన్నారు. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేంద్రానికి నివేదించామన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పినందున ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూడాలని సంజయ్ సూచించారు.

 కలిసికట్టుగా పనిచేయాలి: కిషన్ రెడ్డి

గ్రేటర్ ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని, ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేసేందుకు ఆఫీస్ బేరర్లు కలిసికట్టుగా పని చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సీటు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఉన్నందున పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ స్కీంలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

సెప్టెంబర్ నెలంతా ఉద్యమాలే..

ఆగస్టు 31న..

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చే ప్రోగ్రాం. యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లు, కాలేజీ లెక్చరర్ల సమస్యలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం.

సెప్టెంబర్ 1న..

కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే ప్రోగ్రాం.

సెప్టెంబర్ 2న..

తెలంగాణ విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు పరకాలలో నివాళులర్పించే ప్రోగ్రాం.

సెప్టెంబర్ 3న..

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు వసూలు చేస్తున్న అధిక ఫీజులపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వడం.

సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని, ఆ పోరాటాలు జరిగిన స్థలాలను స్మృతి కేం ద్రాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ అన్ని మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వడం.

సెప్టెంబర్ 4న..

కరోనాను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.

సెప్టెంబర్ 5న..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వడం.

సెప్టెంబర్ 6న..

తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్ర స్థాయిలో కళాకారులతో సమావేశం.

సెప్టెంబర్ 7న..

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చే ప్రోగ్రాం.

సెప్టెంబర్ 8న..

విమోచన దినోత్సవంపై రాష్ట్ర స్థాయిలో మేధావులతో సమావేశం.

సెప్టెంబర్ 11న..

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రవ్యా ప్తంగా నిరసన కార్యక్రమాలు.

సెప్టెంబర్ 12,13 తేదీల్లో ..

కృష్ణా నదిపై నిర్మా ణంలో ఉన్న ప్రాజెక్టుల సందర్శన

సెప్టెంబర్ 17న ఉదయం..

రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ లో జాతీయ జెండా ఎగరేయడం సెప్టెంబర్ 17న సాయంత్రం 4 గంటలకు విమోచన దినోత్సవంపై వర్చువల్ మోడ్ లో బహిరంగ ర్యాలీ.

సెప్టెంబర్ 21న..

గోదావరి నదీ జలాలపై రాష్ట్రస్థా యి రౌండ్ టేబుల్ సమావేశం

సెప్టెంబర్ 25న..

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి పోలిం గ్ బూత్ లో పది మొక్కలు నాటడం. సెప్టెంబర్ చివరి నాటికి ప్రధాని మోడీ హామీ ఇచ్చిన విధంగా రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి రాష్ట్రంలో 100 రైతు ఉత్పత్తి సంఘాల(ఎఫ్వో సీ) ఏర్పాటు కోసం కార్యాచరణ. ఈ ప్రోగ్రాంలను సక్సెస్ చేసే బాధ్యత పార్టీ కొత్త ఆఫీస్ బేరర్లకు అప్పగింత.