కేసీఆర్​ను అరెస్ట్ ​చేయాలి..కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచిపెట్టిండు : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్​ను అరెస్ట్ ​చేయాలి..కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచిపెట్టిండు : వివేక్ వెంకటస్వామి
  •  నాపై బాల్క సుమన్ ఒక్క ఫిర్యాదు చేస్తే ఈడీ రెయిడ్స్ జరిగినయ్
  • కేసీఆర్​పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రెయిడ్స్ ఎందుకు జరుగుతలేవని ప్రశ్న
  • అన్నారం బ్యారేజీ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజినీర్లతో సమీక్ష 
  • బ్యాక్​వాటర్​తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్న రైతులు 
  • కరకట్ట నిర్మించి ఆదుకుంటామని వివేక్ భరోసా

కోల్​బెల్ట్, వెలుగు : కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, లక్ష కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన అవినీతి కేసీఆర్​ను వెంటనే అరెస్ట్​ చేయాలని చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. తనపై మాజీ ఎమ్మెల్యే సుమన్​ఒక్క ఫిర్యాదు ఇస్తే ఈడీ రెయిడ్స్ జరిగాయని, మరి ఇంత భారీ అవినీతికి పాల్పడిన కేసీఆర్​పై తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈడీ రెయిడ్స్​ ఎందుకు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని, దాని వల్ల ఎలాంటి లాభం లేకపోగా బ్యాక్​వాటర్​తో వేలాది మంది రైతులు నాలుగేండ్లుగా పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాలలో బ్యాక్​వాటర్​తో మునిగిపోతున్న పంట భూములను వివేక్ పరిశీలించారు. అన్నారం బ్యారేజీ వద్ద రైతుల సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి కరకట్ట నిర్మాణంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. తన తండ్రి కాకా వెంకటస్వామి తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చేందుకు ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టును తీసుకొచ్చారని గుర్తుచేశారు. ‘‘అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై  రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది.

మరో రూ.24 వేల కోట్లయితే పూర్తయ్యేది. కానీ దాని వల్ల తనకు  ప్రయోజనం లేదని భావించిన మాజీ సీఎం కేసీఆర్.. కేవలం కమీషన్ల కోసం ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మకై రీఇంజినీరింగ్​పేరుతో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్​ప్రాజెక్టుగా మిగిలిపోయింది. ఎక్కడికక్కడ కుంగిపోతున్నది. కానీ దీన్ని కట్టిన కాంట్రాక్టర్లకు మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాలో చోటుదక్కింది. మేఘా కృష్ణారెడ్డి లాంటి పెద్ద కాంట్రాక్టర్​కు బిల్లులన్నీ క్లియర్​చేసిన కేసీఆర్.. చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం పైసా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు.

రీఇంజినీరింగ్​పేరుతో కేసీఆర్​వృథా చేసిన ప్రజాధనంతో తెలంగాణ ప్రజలందరికీ  డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు, దళితులకు మూడెకరాల భూములు ఇచ్చే అవకాశం ఉండేది” అని అన్నారు. కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని, కేసీఆర్​వల్ల రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ఉన్న తెలంగాణ రూ.6 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మిగిలిందన్నారు. 

ముంపు రైతులను ఆదుకుంటం..  

కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో చెన్నూరు నియోజకవర్గంలోని రైతులు నాలుగేండ్లుగా పంటలు నష్టపోతున్నారని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రైతులకు పరిహారం ఇవ్వాలని గత బీఆర్ఎస్ సర్కార్ కు మేం ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. ధర్నాలు కూడా చేశాం. కానీ మాజీ సీఎం కేసీఆర్, స్థానిక బీఆర్ఎస్​లీడర్లు స్పందించలేదు. కనీసం సానుభూతి కూడా చూపలేదు” అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బాధిత రైతులను ఆదుకునేందుకు కరకట్టలు నిర్మించాలని సీఎం రేవంత్​రెడ్డి, ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు.

ఇంజనీర్ల నుంచి ప్రపోజల్స్​తీసుకుంటున్నామని, వాటి ఆధారంగా కరకట్ట నిర్మాణం చేపట్టి  రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా, అంతకుముందు సుందరశాల గ్రామానికి చెందిన కుదురుపాక దేవక్క, ఇతర రైతులు బ్యాక్​వాటర్​ వల్ల తమ బతుకులు ఆగమయ్యాయంటూ వివేక్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్​ఎస్ఈ కరుణాకర్,ఈఈ యాదగిరి, డీఈఈలు సతీశ్, రవిచందర్, ఏఈఈలు రామ్ చందర్, రాజేశ్, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్​చైర్మన్​మూల రాజిరెడ్డి, కాంగ్రెస్​లీడర్లు గొడిసెల బాపురెడ్డి, చేకూర్తి సత్యనారాయణ, హేమంత్​రెడ్డి, చల్ల రాంరెడ్డి, సుందరశాల సర్పంచ్​రత్న మంజుల, తిరుపతిరెడ్డి, సుధాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కేసీఆర్ పై రెయిడ్స్ ఎందుకు చేయట్లే? 

కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన మాజీ సీఎం కేసీఆర్ పై, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిన కాంట్రాక్టర్లపై కేంద్రం ఎందుకు ఈడీ రెయిడ్స్​ చేయించడం లేదని వివేక్​ప్రశ్నించారు. ‘‘నాపై బాల్క సుమన్​ ఒక్క ఫిర్యాదు ఇస్తే ఈడీ రెయిడ్స్​ జరిగాయి. మరి ఇంత అవినీతికి పాల్పడిన కేసీఆర్​పై నేను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు ఈడీ రెయిడ్స్ జరిపించడం లేదు” అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు నేను రూ.8 కోట్లు తెచ్చానని బాల్క సుమన్​ ఒక్క ఫిర్యాదు చేస్తే ఈడీ రెయిడ్స్ చేయించారు. నాపై ఈడీ రెయిడ్స్ తర్వాత పోలీసుల ఎంక్వయిరీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలింది. దీంతో కేసు విత్​డ్రా చేశారు. కానీ ఈడీ ఆఫీసర్లు మాత్రం నన్ను మళ్లీ ఇరికించేందుకు ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు” అని ఆరోపించారు. బీజేపీ వాళ్లు చెప్తున్నట్లుగా కాళేశ్వరం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదన్నారు.