కేసీఆర్​ను  జైల్లో పెట్టాలి: రేవంత్

 కేసీఆర్​ను  జైల్లో పెట్టాలి: రేవంత్

పంచాయతీల నిధులను పక్కదారి పట్టించడం చట్ట విరుద్ధం
మేఘా కృష్ణారెడ్డికి బిల్లులు చెల్లించడానికి తరలించారు
సర్పంచులకు మద్దతుగా ధర్నాకు కాంగ్రెస్ ప్రయత్నం
రేవంత్ సహా పలువురు నేతల అరెస్టు


హైదరాబాద్ :  కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టించిందని, ఇది చట్టవిరుద్ధమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తప్పు చేసిన సీఎం కేసీఆర్‌‌‌‌పై కేసు పెట్టి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 35 వేల కోట్ల పంచాయతీ నిధులను దోచిన గజదొంగ అని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వేరే పనుల కోసం దారి మళ్లించారన్నారు. పంచాయతీలకు నిధులు లేక సర్పంచులు పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ సోమవారం ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌లో జరగాల్సిన ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌కు వస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అరెస్టులు చేశారు. రేవంత్ ఇంటి వద్దకు వచ్చిన కార్పొరేటర్ విజయా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. సీఐ తమతో అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమె కార్యకర్తలతో స్టేషన్​లోనే నిరసన తెలిపారు. పోలీసుల తీరుకు నిరసనగా కొందరు నేతలు ప్రగతి భవన్​ను ముట్టడించేందుకు ప్రయత్నించి అరెస్ట్ అయ్యారు. యువజన నేతలు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద బీఆర్ఎస్ జెండాలు చింపేశారు. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రేవంత్ ఇంటి వద్ద పహారా కాసి, ఉదయం ఆయన బయటికి రాగానే అదుపులోకి తీసుకుని బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. సాయంత్రం వరకు అక్కడే నిర్బంధించారు. రేవంత్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయాలంటూ సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయని భావించి రేవంత్​ను పోలీసులు వదిలిపెట్టారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసులు పెట్టాలి

తమను అరెస్టులు చేయడం కాదని, పంచాయతీల నిధులు మళ్లించినందుకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసులు పెట్టాలని పోలీసులకు రేవంత్ సూచించారు. ‘‘సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఆర్థిక భారంతో ఆత్యహత్యలు చేసుకుంటున్నారు. ఈ దారుణమైన పరిస్థితులు భరించలేక మరికొందరు సర్పంచులు రాజీనామాలు చేస్తున్నారు” అని రేవంత్ చెప్పారు. సిరిసిల్లలో సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని, మునుగోడు సర్పంచ్ భిక్షాటన చేశాడని చెప్పారు. సూర్యాపేటలో మహిళా  నర్పంచ్ పుస్తెలు అమ్ముకొని పనులు చేసిందని తెలిపారు. రైతు వేదికలు, ఉద్యాన వనాలు, శ్మశాన వాటికలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకుండా, ఆ నిధులను మేఘా కృష్ణారెడ్డికి బిల్లులు చెల్లించడానికి తరలించారని ఆరోపించారు. ఈ అధ్వాన పరిస్థితులను తట్టుకోలేక ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌లో 18 మంది సర్పంచులు రాజీనామా చేశారన్నారు. పంచాయతీ సమస్యలపై తమ ఆందోళన ఆపబోమని, కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సర్కారుకు అహంకారం : అరెస్టులపై నేతల ఫైర్
పంచాయతీల సమస్యలపై ధర్నా చేపట్టేందుకు వస్తున్న నేతలు, సర్పంచులు, కార్యకర్తలను అరెస్ట్​ చేయడంపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ తీరును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్​కుమార్ రెడ్డి, జానారెడ్డి, ఆర్.దామోదర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, మహేశ్‌‌‌‌‌‌‌‌​కుమార్ ఖండించారు.

బీహార్ అధికారుల రాజ్యం
‘‘కేసీఆర్ మనవాడు కాదు. పరాయివాడు. 2008లో పార్లమెంట్ సభ్యునిగా రాజీనామా చేసిన సమయంలో.. తాము బీహార్ నుంచి వలస వచ్చినట్లు స్వయంగా చెప్పారు. అందుకే ఆయన టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నారు. రాష్ట్రంలో బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అధికారుల రాజ్యం నడుస్తున్నది. కేసీఆర్ సంగతి తెలంగాణ ప్రజలకు అర్థమైంది, ఆయన బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పారిపోకతప్పదు” అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలను కలవని కేసీఆర్.. ఆంధ్రా నేతలను పిలిచి తిండి పెట్టి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి, ఉమ్మడి శత్రువులను తిప్పికొట్టేందుకు ఇది బీఆర్ఎస్, బీజేపీలు పన్నిన వ్యూహమని అన్నారు.