
కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. తర్వాత మాట్లాడారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారని.. కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడితో అధికారికంగా నిర్వహించడం లేదని చెప్పారు. తెలంగాణ సమాజం మరో పోరాటానికి సమాయత్తం కావాలని, టీఆర్‌ఎస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆ పోరాటానికి నేతృత్వం వహించడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.
అప్పుల పాలైతున్నం….
రాష్ట్ర ప్రజలు కన్న కలలు ఆవిరవుతున్నాయని, పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏళ్లలో రూ.60 వేల కోట్ల అప్పులైతే.. రాష్ట్రం ఏర్పాటైన ఐదేళ్లలో టీఆర్‌ఎస్ సర్కారు రెండు లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు నల్లు ఇంద్రసేనా రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎస్.మల్లారెడ్డి, చింతా సాంబమూర్తి పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో సాగుదాం: కిషన్‌రెడ్డి
పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉద్యమంలో కలిసి పనిచేసిన స్ఫూర్తిని కొనసాగిస్తూ, అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.