
- బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పండబెట్టిందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వానాకాలం నాట్లు అయిపోతున్నా ఇంతవరకూ రైతులకు సాగునీరు అందించలేదని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలని, పంపులను ఆన్ చేసి చెరువులు కుంటలు, రిజర్వాయర్లను నింపేలా ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు.
మంగళవారం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితర నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ముఖ్యంగా రైతుల సంక్షేమంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తున్నదన్నారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఏపీ నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవాల్సిందేనన్నారు.