ఈటలకు లిఫ్ట్ .. వేములవాడ, మిడ్ మానేర్ టూర్ లో స్పెషల్ ట్రీట్మెంట్

ఈటలకు లిఫ్ట్ .. వేములవాడ, మిడ్ మానేర్ టూర్ లో స్పెషల్ ట్రీట్మెంట్

మిడ్​మానేరు, వేములవాడ టూర్​ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్​ను సీఎం కేసీఆర్​ స్పెషల్​గా ట్రీట్​ చేశారు. తాము వెళ్తున్న బస్సును హైదరాబాద్​శివార్లలోని శామీర్​పేట వద్ద ఆపి మరీ ఈటల ఫ్యామిలీని ఎక్కించుకున్నారు. వేములవాడ ఆలయంలో పూజలు, మిడ్​మానేరు వద్ద కార్యక్రమాలకు వారిని తీసుకెళ్లారు. ఈటల తన భార్య, కోడలు, బిడ్డ, అల్లుడితో కలిసి వచ్చారు. కొద్దినెలలుగా కేసీఆర్, ఈటల దూరం దూరంగా ఉన్న సమయంలో ఇలా జరగడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇంతకాలంగా ఇరువురి మధ్య ఉన్న మనస్పర్థలు సమసిపోయినట్టేనా, ఈటలకు మళ్లీ ప్రగతిభవన్​తో సంబంధాలు మెరుగుపడ్డాయా అని టీఆర్ఎస్​ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే త్వరలో మున్సిపల్​ ఎలక్షన్లు జరుగనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్​జిల్లా పరిధిలో బీజేపీ బలపడింది. లోక్​సభ ఎలక్షన్లలో బీజేపీ ఎంపీ సీటును గెలుచుకుంది. మరోవైపు టీఆర్ఎస్​లో మాత్రం నేతల మధ్య విభేదాలు నెలకొని ఉన్నాయి. ఇది మున్సిపల్​ ఎలక్షన్లలో ప్రభావం చూపవచ్చన్న ఉద్దేశంతోనే.. నేతలను ఏకతాటిపైకి తేవాలని సీఎం కేసీఆర్​ భావిస్తున్నారు. అందుకే ఈటలకు ప్రయారిటీ ఇచ్చి, యాక్టివ్​గా మార్చుతున్నారని రాజకీయవర్గాలు చెప్తున్నాయి.

జెండా ఓనర్లం కామెంట్లతో..

సుమారు నాలుగు నెలల కింద ఈటల రాజేందర్  తన సెగ్మెంట్​ కార్యకర్తల సమావేశంలో ‘‘గులాబీ జెండా ఓనర్లం మేమే. మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు’’ అంటూ చేసిన కామెంట్లు పెద్ద దుమారం రేపాయి. అప్పట్నుంచి మంత్రి ఈటలకు ప్రగతిభవన్ నుంచి పిలుపులు తగ్గాయి. ఈటల కూడా అటువైపు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కేవలం కేబినెట్ సమావేశం ఉన్నప్పుడు మాత్రమే ప్రగతిభవన్ కు వెళ్లి వచ్చేవారు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరిగింది. అయితే ఈటల ఈ మధ్య తన బిడ్డ పెండ్లి పత్రిక ఇచ్చేందుకు ప్రగతిభవన్ కు వెళ్లారు. సీఎం ఆ పెండ్లికి హాజరయ్యారు. ఆ సమయంలో ఈటలను గట్టిగా కౌగిలించుకున్న ఫోటో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తర్వాత ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం సమయంలో ఈటలను సీఎం పొగడ్తలతో ముంచెత్తారు. అయినా తర్వాత ఇద్దరి మధ్య దూరం కొనసాగింది. తాజాగా ఈటల ఫ్యామిలీని సీఎం స్వయంగా వేములవాడ టూర్​కు తీసుకెళ్లారు.

మున్సిపల్ ఎన్నికల కోసమా?

కరీంనగర్  మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికను టీఆర్ఎస్  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్  ఎంపీ సీటును బీజేపీ గెలుచుకోవడాన్ని ఆ పార్టీ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మధ్య అక్కడ బీజేపీ బలం మరింత పెరిగిందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో ఎలాగైనా కరీంనగర్​ కార్పొరేషన్​ను దక్కించుకోవాలని భావిస్తున్నట్టు టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలందరినీ ఏకతాటిపైకి తెస్తే బీజేపీని ఎదుర్కోవచ్చని అనుకుంటున్నట్టు పేర్కొంటున్నాయి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్​ను ఓడించేందుకు ఈటల బీజేపీ నేతలతో చేతులు కలిపారని గంగుల వర్గీయుల్లో అనుమానం ఉంది. కేటీఆర్ కూడా ఈటల విషయంలో వ్యతిరేకంగా ఉన్నారని చర్చ పార్టీలో ఉంది. ఇక ఆ ఎలక్షన్ల సమయంలో తనకు టికెట్​ ఇవ్వకపోవడంతో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ.. సీఎం కేసీఆర్, కేటీఆర్​లపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈటల సపోర్టుతోనే ఆమె విమర్శలు చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఈటల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రగతిభవన్ కు సన్నిహితంగా ఉండే మీడియాలో కథనాలు వచ్చాయి. ఓ దశలో ఈటలకు మంత్రి పదవి ఇవ్వరన్న ప్రచారం జరిగింది. చివరికి కేబినెట్లోకి తీసుకున్నా.. ప్రగతిభవన్ తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న చర్చ జరిగింది. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గంగుల కు మంత్రి పదవి ఇచ్చారు. ఈటలకు చెక్ పెట్టేందుకే గంగులను తెరపైకి తెచ్చారన్న అభిప్రాయం వ్యక్తమైంది. మొదట్నుంచీ ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇది ఎలక్షన్లలో ఎఫెక్ట్​ చూపిస్తుందని కేసీఆర్​ గ్రహించారని టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాక ఉద్యమ సమయం నుంచీ ఈటలకు ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటలను దగ్గర చేస్తున్నారని, ఇరువర్గాలు ఒకేతాటికి వస్తే ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నట్టు సమాచారం.