
చిల్లర రాజకీయాల కోసం రాష్ట్రంలోని ప్రజలకు పెన్షన్ ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ స్కీమ్స్ వెనుక ఎంతో మేధోమథనం ఉందన్నారు. రూ. 1000 మొదలైన పెన్షన్ల ప్రస్థానం నేడు రూ.2016కు చేరిందని కేసీఆర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం... పార్టీ జిల్లా కార్యాలయాన్ని, కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సీఎం... అనేక రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. ఈసారి రూ. 2 లక్షల 20 వేల కోట్లు దాటిపోనుందని పేర్కొన్నారు.
కేంద్రం సహకరించకున్న 33జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం తెలిపారు. రైతుబంధు పై మాట్లాడిన కేసీఆర్... 93% మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్నవారేనని చెప్పారు. గురుకుల విద్యలో మనకు మనమే సాటి ఎవరు మనకు పోటీ లేరన్నారు. ఇదంతా సాధ్యమైందంటే ఒక కేసీఆర్, ఒక సీఎస్, మంత్రులతో కాదు మనందరి సమష్టి కృషి అని పేర్కొన్నారు. అన్ని కులాల, మతాల వారికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటున్నామని సీఎం తెలిపారు.