దేశ్ కీ నేత ప్రకటనలకు రూ.266 కోట్లు.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారినప్పుడు రూ. 244.17 కోట్ల ప్రకటనలు

దేశ్ కీ నేత  ప్రకటనలకు రూ.266 కోట్లు.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారినప్పుడు  రూ. 244.17 కోట్ల ప్రకటనలు
  • పూర్తికాని పాలమూరు– రంగారెడ్డి ప్రారంభోత్సవానికే రూ.22.13 కోట్ల  ప్రచారం
  • వివిధ ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ రిలీజ్
  • పప్పు బెల్లంలా పత్రికలకు పైసలు పంచిన కేసీఆర్
  • ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళం, రాజస్థానీ పత్రికలకు ప్రకటనలు

హైదరాబాద్: ప్రజాధనం పప్పు బెల్లమైంది. తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్క 2023 అంటే ఎన్నికల  సంవత్సరంలో కేసీఆర్ ప్రకటనలకు ఖర్చు చేసింది అక్షరాలా 266 కోట్లు. ఇది తెలుగు, ఉర్దూ పత్రికలకు ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్ల లెక్క కాదు.  దేశ్ కీ నేతగా ఎదగాలనుకున్న కేసీఆర్ అప్పట్లో పంజాబ్ రైతులకు కూడా తెలంగాణ నుంచి వెళ్లి పరిహారం అందించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోనూ పార్టీ శాఖలు ఏర్పాటు చేసి అక్కడా సభలు నిర్వహించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అక్కడి  పత్రికలను ప్రసన్నం చేసుకునేందుకు  ఏకంగా 266 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినపుడు రూ. 244.17 కోట్ల ప్రజాధ‌నాన్ని ప్రకటనల పేరిట పత్రికలకు లబ్ధి చేకూర్చారు. నిర్మాణం పూర్తికాని పాలమూరు  రంగారెడ్డి  ప్రాజెక్టు  ప్రారంభోత్సవం అంటూ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబరు 16, 17 తేదీల్లో రూ. 22.13 కోట్ల ప్రజాధనాన్ని పది భాషల్లోని పత్రికల్లో ప్రకటనలకు దుర్వినియోగం చేసింది.

  పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ప్రకటనను 13 తెలుగు దినపత్రికలతో పాటు , 7 ఇంగ్లీషు, 3 హిందీ, 6 ఉర్దూ, 2 మ‌రాఠీ ప‌త్రిక‌లు, 296 ఇత‌ర చిన్నా చిత‌కా ప‌త్రిక‌లు 322 మ్యాగ‌జైన్లకు ప్రకటనల కోసం రూ.22,13,55,038 అందించారు.  తెలుగు పత్రికలకు రూ.6.57 కోట్లు, ఆంగ్ల పత్రికలకు రూ.7.16కోట్లు, హిందీ పత్రికలకు రూ.3.3కోట్లు, ఉర్దూ పత్రికలకు రూ.98లక్షలు, మరాఠీ పత్రికలకు 1.23 కోట్లను పప్పు బెల్లాల్లా పంచారు.టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినపుడు తెలంగాణలో ప్రగతి పథకాల పేరిట ప్రకటనలను పత్రికలకు కేసీఆర్ విడుదల చేశారు. పంజాబ్ రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు పత్రికలకు రూ. 244 కోట్ల రూపాయలను ప్రకటనల పేరిట తెలంగాణ ప్రజాధనాన్ని పంచారు. 

బీఆర్ఎస్ గా మారిన  ఏడాదే రూ. 244.17 కోట్లు

2022లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. తనకు  జాతీయ స్థాయి గుర్తింపు రావాలని భావించి ఇక్కడ అమలవుతున్న పథకాలతో కూడిన యాడ్లను అద్భుతంగా డిజైన్లు చేయించి తెలుగే కాక‌, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, మ‌ల‌యాళం, త‌మిళం, మ‌రాఠి, ఒరియా, గుజ‌రాతి, బెంగాలి, పంజాబీ ఇలా ఒక్కటేమిటి దేశంలోని చిన్నా చితకా పత్రికల్లో కూడా ప్రకటనలు ఇచ్చుకున్నారు.  దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేసింది.