- అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవ్
- ఫామ్‌హౌస్‌లో తనను కలిసిన ఏకగ్రీవ సర్పంచ్‌లతో కేసీఆర్
సిద్దిపేట/ములుగు, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు. కొన్ని కొన్ని సార్లు కష్టాలూ వస్తయ్. అప్పుడు భయపడొద్దు. మళ్లా అధికారంలోకి వచ్చేది మనమే. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయ్. అప్పటి దాకా ఎవరూ అధైర్యపడొద్దు.
మన ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో, స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలె’’అని కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ కొత్త సర్పంచ్ లు, వార్డు సభ్యులు శుక్రవారం ఫామ్ హౌజ్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ‘బీఆర్ఎస్ హయాంలో గ్రామాలన్నీ ఆర్థికంగా బలంగా ఉన్నాయి. స్వయం సమృద్ధి సాధించాయి. దళిత, గిరిజన, బహుజన మహిళా వర్గాలు, కుల వృత్తులను ప్రోత్సహించినం.
మేము చేపట్టిన సంస్కరణలు.. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినయ్’’అని ఆయన అన్నారు. గ్రామీణాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం, తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందించాయని తెలిపారు. గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సూచించారు.
గంగదేవిపల్లి ఆదర్శంగా తీసుకోవాలి..
గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలని కేసీఆర్ అన్నారు. ‘‘మన పని మనం చేసుకుంటూ.. మన పల్లె అభివృద్ధికి పాటుపడాలి. ఎవరో ఏదో చేస్తారని.. ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావొద్దు. మన ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో గ్రామాలను సామాజిక, ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవాలి’’అని కేసీఆర్ సూచించారు.
ఎర్రవెల్లి గ్రామ సర్పంచ్ నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్ తో పాటు వార్డు మెంబర్లు, నర్సన్నపేట సర్పంచ్ గిలక బాల నర్సయ్యతో పాటు 2 గ్రామాల ప్రముఖులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అందరికీ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
