బీఆర్‌‌ఎస్‌‌ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్

బీఆర్‌‌ఎస్‌‌ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్
  • 14న జాతీయ పార్టీ ఆఫీస్‌‌ ప్రారంభం
  • ఆఫీస్‌‌ ఆవరణలో రెండు రోజుల పాటు యాగం
  • ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం తర్వాత కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరనున్నారు. టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ పేరును బీఆర్‌‌ఎస్‌‌గా మార్చిన తర్వాత మొదటిసారి ఆయన దేశ రాజధానికి వెళ్తున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీలో పలువురు రిటైర్డ్‌‌ బ్యూరోక్రాట్లు, సీనియర్‌‌ జర్నలిస్టులతో ఆయన సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంగళవారం ఉదయం సర్దార్‌‌ పటేల్‌‌ రోడ్డులో ప్రారంభించనున్న బీఆర్‌‌ఎస్‌‌ జాతీయ కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. మంగళ, బుధవారాల్లో ఆఫీస్‌‌ ఆవరణలో సీఎం కేసీఆర్‌‌ కుటుంబ సభ్యులతో కలిసి యాగం నిర్వహించనున్నారు. 14న బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఆఫీస్‌‌ను కేసీఆర్‌‌ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణ, సినీనటుడు ప్రకాశ్‌‌రాజ్‌‌, పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరవనున్నారు. పార్టీ ఆఫీస్‌‌ ప్రారంభించిన తర్వాత కేసీఆర్‌‌ జాతీయ మీడియానుద్దేశించి మాట్లాడుతారు. మీడియా సమావేశంలోనే బీఆర్‌‌ఎస్‌‌ జాతీయ కార్యవర్గాన్ని కేసీఆర్ ప్రకటించనున్నారు. తనతో పాటు జాతీయ కార్యవర్గంలో ఎమ్మెల్సీ కవిత, పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులకు చోటు కల్పిస్తారని ప్రచారంలో ఉంది. ఈనెల 16వ తేదీ వరకు కేసీఆర్‌‌ ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయని ప్రగతి భవన్‌‌ వర్గాలు చెప్తున్నాయి. సీఎంతో పాటు కొందరు మంత్రులు, ఇతర నాయకులు ఢిల్లీ వెళ్తుండగా మిగతా వాళ్లందరూ మంగళవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోవాలని కేసీఆర్‌‌ ఇప్పటికే ఆదేశించారు.

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి, ఎంపీ

ఢిల్లీలో ఈ14న ప్రారంభించనున్న బీఆర్‌‌ఎస్‌‌ ఆఫీసును మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌‌ కుమార్‌‌ ఆదివారం పరిశీలించారు. ఢిల్లీలో పార్టీ ఆఫీస్‌‌ కోసం సొంత బిల్డింగ్‌‌ నిర్మిస్తున్నా ఆ పనులు ఆలస్యమవుతుండటంతో ప్రస్తుతం అద్దె భవనంలో పార్టీ ఆఫీసు ప్రారంభిస్తున్నారు. బీఆర్‌‌ఎస్‌‌ జాతీయ రాజకీయాల్లో సక్సెస్‌‌ కావాలని కోరుతూ కేసీఆర్‌‌ కుటుంబ సభ్యులు యాగం నిర్వహించనున్నారు. ఈ యాగశాల ఏర్పాట్లను మంత్రి, ఎంపీ పరిశీలించారు. సోమవారం సాయంత్రానికి యాగశాలను సిద్ధం చేసేలా పనుల్లో వేగం పెంచారు. పార్టీ ఆఫీస్‌‌లో వాస్తు ప్రకారం ఏ గదిని ఎలా వాడుకోవాలి.. ఏ ఫర్నిచర్‌‌ ఎక్కడ పెట్టాలి.. యాగశాలలో యాగ కుండాలు ఎన్ని నిర్మించాలనే దానిపై వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్‌‌ తేజ పలు సూచనలు చేశారు.