కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌పై హైకోర్టుకు కేసీఆర్‌

కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌పై హైకోర్టుకు కేసీఆర్‌

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్‎పై రిపోర్టుపై హైకోర్టుకు వెళ్లారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఱ మంత్రి హరీష్​ రావు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను హైకోర్టులో సవాల్ చేశారు కేసీఆర్, హరీష్​ రావు. ఈ మేరకు ఇద్దరు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ వేసిందని.. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్, హరీష్​ రావు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్‌ నివేదిక ఆ రకంగా ఉందని  ఆరోపించారు. వీరి పిటిషన్లు 2025, ఆగస్ట్ 20న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ నెలకొంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‎లో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బారాజ్‎ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2024, మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపింది. 

ఈ బారాజ్‎లకు సంబంధించిన డీపీఆర్, డిజైన్లను పరిశీలించిన కమిషన్.. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను విచారించింది. విచారణలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావును కూడా కమిషన్ ఇన్విస్టిగేట్ చేసింది. 

అధికారులు, క్రాంటాక్టర్లు, రాజకీయ నాయకులు ఇలా మొత్తం 115 మందిని విచారించి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది కమిషన్. వారి వాంగ్మూలాలను విశ్లేషించి తుది రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరడంతో అందులో ఏముందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాపీ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టగా.. అందుకు సర్కార్ నో చెప్పింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును డైరెక్ట్ అసెంబ్లీలోనే టేబుల్ చేసి చర్చ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ తరుణంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీష్​ రావు కోర్టు మెట్లు ఎక్కడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‎గా మారింది.