వరదలు వచ్చిన వారం తర్వాత పర్యటిస్తవా?

వరదలు వచ్చిన వారం తర్వాత పర్యటిస్తవా?
  • ఎనిమిదేండ్లు సీఎంగా ఉన్నావ్​.. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గోదావరి కరకట్టల ఎత్తు ఎందుకు పెంచలేదు?
  • వైఎస్​ఆర్​టీపీ చీఫ్​ షర్మిల

భద్రాచలం/పినపాక, వెలుగు : తక్షణ వరద సాయం రూ.10 వేలు కాదు, రూ.25 వేలు ఇవ్వాలని వైఎస్​ఆర్​టీపీ చీఫ్​ షర్మిల డిమాండ్ ​చేశారు.  గోదావరి కరకట్టల ఎత్తు పెంచాలని, భద్రాద్రిని గోదావరి వరదల నుంచి రక్షించాలని ఆమె కోరారు. సీఎం కేసీఆర్​ కరకట్టపై నిలబడి పిట్ట కథలు చెప్పి వెళ్లారని, ఒక్క కాలనీకైనా వెళ్లి బాధితులను పరామర్శించారా? అని ఆమె ప్రశ్నించారు.  భద్రాచలంలో సుభాష్​నగర్​కాలనీ, అలాగే పినపాక మండలంలోని గోదావరి ముంపు గ్రామం రావిగూడెంలో వరద బాధితులను శనివారం ఆమె పరామర్శించారు. 

అనంతరం సుభాష్​నగర్​కాలనీలో సబ్​కలెక్టర్​ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రాచలం పట్టణానికి కరకట్ట ఎత్తు పెంచకపోవడమే వరదలకు కారణం అన్నారు. ‘‘ఎనిమిదేండ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు కరకట్ట ఎత్తు పెంచలేదు? వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత హెలికాప్టర్​లో పర్యటిస్తవా? ముంపు ప్రాంతాల్లో ఎవరినీ పరామర్శించలేదు. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సాయం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

వరదలకు కారణం విదేశాల కుట్ర, క్లౌడ్​ బరస్ట్ అంటూ సీఎం ఏవేవో మాట్లాడుతున్నాడు. ఆయన కంత్రీ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. పోలవరమే వరదలకు కారణమని పువ్వాడ అంటున్నాడు.మరి ఇన్నాళ్లు మీరేం చేశారు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ ఇండ్లకు పిలిచారు. స్వీట్లు తినిపించారు కదా. అప్పుడు గుర్తురాలేదా పోలవరం ప్రాజెక్టు? భద్రాచలంలో వరదలు రావడానికి సీఎం కేసీఆరే కారణం. కరకట్ట ఎత్తు పెంచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు” అని షర్మిల అన్నారు. హామీలు ఇచ్చి విస్మరించడం కేసీఆర్​కు వెన్నతో పెట్టిన విద్య అని ఆమె విమర్శించారు. తక్షణ సహాయం కింద రూ.10 వేలు ప్రకటించి వారం గడుస్తున్నా నేటికీ బాధితులకు సహాయం అందకపోవడం దారుణమని మండిపడ్డారు.