దేశవ్యాప్తంగా 50 ఎంపీ సీట్లలో పోటీకి కేసీఆర్​ ప్రణాళికలు

దేశవ్యాప్తంగా 50 ఎంపీ సీట్లలో పోటీకి కేసీఆర్​ ప్రణాళికలు
  • జాతీయ పార్టీకి కేసీఆర్.. ​టీఆర్ఎస్​ చీఫ్​గా కేటీఆర్​!
  • దేశవ్యాప్తంగా 50 ఎంపీ సీట్లలో పోటీకి కేసీఆర్​ ప్రణాళికలు
  • వాఘేలాకు గుజరాత్‌, ప్రకాశ్‌రాజ్‌కు కర్నాటక బాధ్యతలు
  • త్వరలో కరీంనగర్​, ఢిల్లీలో భారీ సభలు

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌గా మంత్రి కేటీఆర్‌‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. దసరా రోజున ముహూర్తం ఖరారైంది. ఈ నెల 5న ఉదయం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించే టీఆర్‌‌ఎస్‌‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇందుకు వేదిక కానుంది. ఇదే మీటింగ్‌‌లో జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. టీఆర్‌‌ఎస్‌‌ ఎన్నికల గుర్తయిన ‘కారు’ను నేషనల్‌‌ పార్టీకి కూడా కొనసాగించాలని రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేయనుంది. కొత్త పార్టీ జాతీయాధ్యక్షుడిగా కేసీఆర్‌‌ ఎన్నిక కానున్నారు. రైతు సమస్యలే ఎజెండాగా, తెలంగాణ ప్రభుత్వ పథకాలే అస్త్రాలుగా కేసీఆర్‌‌ దేశవ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా కనీసం 50 పార్లమెంట్‌‌ సీట్లలో పోటీ చేయాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. ఆదివారం ఉదయం సిద్దిపేట జిల్లా కోనాయపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్‌‌ ప్రత్యేక పూజలు చేయనున్నట్టు సమాచారం.

ఒంటరిగానే పోటీ.. ఎన్నికల తర్వాత పొత్తు!

రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, బీసీల సమస్యలే ఎజెండాగా కేసీఆర్‌‌ జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. పాత హైదరాబాద్‌‌ సంస్థానంలోని ప్రస్తుత తెలంగాణ, కర్నాటకలోని బీదర్‌‌, గుల్బర్గా, ఉస్మానాబాద్‌‌, రాయిచూర్‌‌, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌, పర్భణీ, నాందేడ్‌‌, బీడ్‌‌ ప్రాంతాలపై ఆయన ప్రధానంగా ఫోకస్‌‌ పెట్టినట్టు తెలుస్తోంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా బలమైన రైతు ఉద్యమ నేతలు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి, అక్కడ అభ్యర్థులను పోటీకి దించాలనే యోచనలో కేసీఆర్​ ఉన్నారు. వచ్చే పార్లమెంట్‌‌ ఎన్నికల్లో కనీసం 50 లోక్‌‌సభ స్థానాల్లో కారు గుర్తుపై క్యాండిడేట్లను బరిలోకి దించాలని భావిస్తున్నారు. కర్నాటకలో సినీ నటుడు ప్రకాశ్‌‌ రాజ్‌‌, గుజరాత్‌‌లో ఆ రాష్ట్ర మాజీ సీఎం శంకర్‌‌ సింగ్‌‌ వాఘేలా.. కేసీఆర్‌‌ జాతీయ పార్టీలో పనిచేసే అవకాశముందని తెలిసింది. పార్లమెంట్‌‌ ఎన్నికల ఫలితాల ఆధారంగా పోస్ట్‌‌ పోల్‌‌ అలయెన్స్‌‌లపై ఆయన దృష్టి సారించవచ్చని పార్టీలో చర్చ సాగుతున్నది. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తారని చెబుతున్నారు.

దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటనకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలను ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా వారు పాల్గొంటారని సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించే తీర్మానాన్ని ఇప్పటికే ఫైనల్‌‌ చేసినట్టు తెలుస్తున్నది. అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్‌‌ కె. కేశవరావుతో పాటు రాష్ట్ర కార్యవర్గం ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేయనుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌‌ శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం వరంగల్‌‌ టూర్‌‌లో భాగంగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆదివారం ఉదయం సిద్దిపేట జిల్లా కోనాయపల్లికి వెళ్లి అక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్‌‌లోని ఎంజీ రోడ్డులో గాంధీ సర్కిల్‌‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కేసీఆర్‌‌ ఆవిష్కరిస్తారు. గాంధీ హాస్పిటల్‌‌ ఎదుట ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించి, హాస్పిటల్‌‌ ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడుతారు. ఇదే వేదికపై జాతీయ పార్టీ గురించి పలు విషయాలు వెల్లడించే అవకాశముంది. దసరా తర్వాత కరీంనగర్‌‌లో భారీ సభకు కేసీఆర్‌‌ ప్లాన్‌‌ చేస్తున్నారు. టీఆర్‌‌ఎస్‌‌ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత మొదటి బహిరంగ సభ కరీంనగర్‌‌లోనే పెట్టారు. ఇప్పుడూ అదే సెంటిమెంట్‌‌ కొనసాగించనున్నారు. కరీంనగర్‌‌ సభలోనే జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించనున్నారు. తర్వాత ఢిల్లీలో భారీ బహిరంగ సభకు కేసీఆర్‌‌ ప్లాన్‌‌ చేస్తున్నారు.

రాష్ట్రంలో కేటీఆర్‌‌ సెంట్రిక్‌‌గానే..

టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న కేటీఆర్‌‌కు జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత మరిన్ని అధికారాలు కట్టబెట్టనున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడికి ఉన్న పవర్స్‌‌ అన్నింటినీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌కు దఖలు పరుస్తూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం (ప్లీనరీ)లో తీర్మానం చేశారు. పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా తీసుకునే అధికారం కేటీఆర్‌‌‌‌కు అప్పజెప్పారు. జాతీయ పార్టీ ఆవిర్భావంతో కేటీఆర్‌‌ టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌గా ప్రమోట్‌‌ కానున్నారు. ఇకపై రాష్ట్ర రాజకీయాలన్నీ కేటీఆర్‌‌ సెంట్రిక్‌‌గానే కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక వ్యవహారాలన్నీ కేటీఆరే చక్కబెడ్తున్నారు. ఇకపై పార్టీలోనూ అన్నీతానై వ్యవహరించనున్నారు. జాతీయ పార్టీ తీర్మానానికి సీఈసీ ఆమోదం తెలపడం, ఆ తర్వాత అందులో టీఆర్‌‌ఎస్‌‌ను విలీనం చేసే ప్రక్రియ చూసే బాధ్యతను ఓ సీనియర్‌‌ నేతకు అప్పగించారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు కేటీఆరే ఫాలో అప్‌‌ చేయనున్నట్టు తెలిసింది.

యాదాద్రిలో అభివృద్ది పనుల కోసం రూ.43 కోట్లు 

యాదాద్రి, వెలుగు: శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి అనుబంధ ఆలయాలను ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించారు. యాదగిరిగుట్టపై అభివృద్ధి పనుల కోసం రూ.43 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. రెవెన్యూ శాఖ నుంచి 2,157 ఎకరాల భూమిని వైటీడీఏ వెంటనే తన అధీనంలోకి తీసుకోవాలని, ఆలయ అవసరాల కోసమే ఆ భూమిని ఉపయోగించాలని చెప్పారు. విమాన గోపురానికి గతంలో ప్రకటించిన 1.16 కిలోల బంగారం విరాళాన్ని అందించడానికి కేసీఆర్ సతీసమేతంగా యాదగిరిగుట్టకు శుక్రవారం ఉదయం 11.50కి వచ్చారు. గుట్టపై కేసీఆర్ 5 గంటలపాటు గడిపారు. ప్రతిసారీ దర్శనం తర్వాత రివ్యూ చేసే వారు. కానీ ఈసారి ముందుగానే 4 గంటలపాటు రివ్యూ నిర్వహించారు. అక్కడి నుంచి ఆలయం వద్దకు చేరుకున్న సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ దంపతులు.. స్వయంభూమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 4:32కు యాదగిరిగుట్ట పర్యటన ముగించుకుని హైదరాబాద్‌‌కు పయనమయ్యారు.

స్వర్ణతాపడానికి రూ.52.48 లక్షలు

లక్ష్మీనరసింహస్వామి ఆలయ గర్భగుడిపై ఉన్న దివ్యవిమాన గోపురానికి ఏర్పాటు చేసే బంగారు తాపడం కోసం 1.16 కిలోల బంగారానికి సరిపడా రూ.52,48,097ను సీఎం కేసీఆర్ దంపతులు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందజేశారు. స్నేహిత బిల్డర్స్ కంపెనీ రూ.51,00,624, హైదరాబాద్‌‌కు చెందిన ఏనుగు దయానంద్ రెడ్డి రూ.50.04 లక్షలు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.20 లక్షలు, హైదరాబాద్‌‌కు చెందిన ఎ.రజిత రూ.30.15 లక్షలు విరాళంగా ఇచ్చారు. విమాన గోపురానికి విరాళంగా ప్రకటించిన చెక్కును తేవడం మర్చిపోవడంతో దానిని హైదరాబాద్​ నుంచి గ్రీన్​ చానల్ ద్వారా తెప్పించేందుకు కేసీఆర్ గంటపాటు వెయిట్ చేశారని తెలిసింది. సీఎం పర్యటనతో క్యూలైన్లలో ఉన్న భక్తులు బయటకు రాకుండా పోలీసులు గేట్లు మూసేయడంతో  మీడియా ప్రతినిధులు మూడున్నర గంటల పాటు క్యూలైన్​లోనే ఉండిపోయారు.