
- కమీషన్లు రావని ప్రాణహితను కాళేశ్వరానికి మార్చిండు
- తుమ్మిడిహెట్టి తరలించి అదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టిండు
- ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ స్థలం వద్ద తీన్మార్ మల్లన్న
కాగ జ్ నగర్, వెలుగు: కేసీఆర్ అంటే కమీషన్లు, చీటింగ్, రాక్షసుడు అని అర్థమని , వైఎస్ హయాంలో ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పథకాన్ని కాళేశ్వరం కమిషన్లకు కక్కుర్తి కోసం తరలించి అదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టారని తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. మంగళవారం సిర్పూర్ నియోజక వర్గంలో ఆయన పర్యటించారు. పొద్దున కాగ జ్ నగర్ లో ఎస్పీఎం కంపెనీ కార్మికులతో మాట్లాడారు. తర్వాత కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. కమీషన్లు రావనే ప్రాణహిత ప్రాజెక్టు కు సీఎం రీ డిజైన్ పేరు పెట్టి కాళేశ్వరానికి తరలించాడన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలోని ఏడు జిల్లా ఉన్త 14 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రారంభించారని, ఈ ప్రాజెక్ట్ కాలువల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తీసుకున్న నిర్ణయంతో ఆ పదివేల కోట్లు నిష్ఫలమయ్యాయన్నారు. అంతేగాక ఇక్కడ ప్రాజెక్ట్ రూ.39వేల కోట్లతో పూర్తయ్యే అవకాశం ఉన్నా, ‘కాళేశ్వరం’తో లక్షా నలభై వేల కోట్లు ఖర్చు చేయడంలో మతలబు కమీషన్లు మాత్రమేనన్నారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టలేనందుకు సీఎం కేసీఆర్ రైతులకు బహిరంగంగ క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రభుత్వం దొడ్డిదారిన రైతుల నుంచి తీసుకున్న భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని దీనికి ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో సహా ఏ ప్రాజెక్టుకైనా గ్లోబల్టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత ప్రాజెక్టును ప్రారంభిస్తానని వచ్చే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత కాగజ్‌నగర్ ఎస్పీఎం కంపెనీలో నాన్ లోకల్స్ఉద్యోగాలు, వేతనాలు ఎక్కువగా పొందుతున్నారని స్థానిక కార్మికులు చెప్పగా ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఫోన్‌చేసి మాట్లాడారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఎస్పీఎం జేకే కంపెనీ ప్రతినిధులు, కార్మికులతో కలిసి చర్చలు జరిపారు. ఆయన తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న, జిల్లా నాయకులు మారుతి, రవీందర్ పాల్గొన్నారు.