
- మీరెక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వస్త: బండి సంజయ్
- రుణమాఫీ చేయండి.. ఉద్యోగాలు, డబుల్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పోడు పట్టాలు ఇవ్వండి
- కేసీఆర్ కుటుంబానికి సంస్కారం లేదు
- ప్రజా సమస్యలపై పోరాడితే
- ‘‘చెప్పులతో కొడ్తం.. తల నరుకుతం’’ అంటరా? అని ఫైర్
రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు: రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే, చెప్పు తో కొట్టించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ అన్నారు. ‘‘రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయండి. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వండి. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు ఇవ్వండి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వండి. జీపీలకు నిధులు మంజూరు చేయండి. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వండి. ఈ హామీలన్నీ నెరవేరిస్తే.. చెప్పుతో కొట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఎక్కడ చెప్పుతో కొడ తారో చెప్పండి.. అక్కడికి నేనే వస్తా’’ అని ఆయన అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంజయ్ పర్యటించారు. సెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల, వేములవాడలో బీజేపీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ‘‘అయ్య, కొడుకు, బిడ్డ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. నా తలను ఆరు ముక్కలుగా నరుకుతానని కేసీఆర్ అంటున్నడు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను చెప్పుతో కొడతానని కవిత అంటున్నది. నన్ను కరీంనగర్ కమాన్ కాడ చెప్పుతో కొడతానని కేటీఆర్ అంటున్నడు. ఇదేనా మీ సంస్కారం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే చెప్పులతో కొడ్తరా? తలలు నరుకుతారా?” అని ఫైర్ అయ్యారు. ‘‘డ్రగ్స్ కేసుపై మాట్లాడితే కేటీఆర్ మండిపడుతుండు. తప్పు చేయనప్పుడు ఆయనకు అంత ఉలుకెందుకు?” అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి..
బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని సం జయ్ విమర్శించారు. ‘‘ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తే ఎవరూ రాలేదు. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి” అని అన్నారు. లిక్కర్ కేసులో కవిత పేరు ఉన్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు ప్రజల సొమ్ముతో ఇస్తున్నారని, ఆ కిట్లకు కేసీఆర్ పేరెందుకని ప్రశ్నించారు. ‘‘ఓ ప్రభుత్వ అధికారి ఏసుక్రీస్తు వల్లే కరోనా తగ్గిందని మాట్లాడటం సిగ్గుచేటు. ఉన్నతాధికారివై ఉండి ఎమ్మెల్యే పదవి కోసం సీఎం కాళ్లు మొక్కుతావా?” అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావుపై మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక డీహెచ్ అవినీతిని నిరూపిస్తామన్నారు.
కేటీఆర్ డిప్రెషన్లోకి పోయిండు..
కేటీఆర్ డ్రగ్స్ బంజేసి, డిప్రెషన్ లోకి పోయిండని సంజయ్ విమర్శించారు. అందుకే తనను చెప్పు తో కొట్టుకోవాలని అంటున్నాడని మండిపడ్డారు. ‘కేటీఆర్.. నీ బొచ్చు ఎవరికి కావాలి. రాత్రి మం దు తాగి మూడ్రోజుల తర్వాత టెస్టుకు రెడీ అంటే ఎట్ల.. రిజల్ట్ వస్తదా?” అని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్ దోస్తులున్నారని ఆరోపించారు. ‘‘బిడ్డ లిక్కర్ స్కామ్లో ఉంది. కొడుకు ఇంకో స్కామ్లో ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ పెట్టినా కేసీఆ ర్ను కాపాడేవాళ్లు లేరు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలెటర్ పై ఉంది” అని విమర్శించారు.
సెస్ ఎన్నికల్లో సత్తా చాటుతాం..
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఎన్నికల్లో సత్తా చాటుతామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. సెస్ పరిధిలోని అన్ని డైరెక్టర్ స్థానాలను గెలుస్తామన్నారు. ‘‘గతంలో అధికార పార్టీకి చెందిన పాలక వర్గాలు అవినీతికి పాల్పడ్డాయి. రూ.33 కోట్ల స్కామ్ చేసిన వ్యక్తినే మళ్లీ అధికార పార్టీ బలపరిచింది. అతణ్ని చిత్తుగా ఓడించాలి” అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సెస్ రూ.450 కోట్ల నష్టాల్లో నడుస్తోందని, ప్రభుత్వ ఆఫీసులు కోట్ల కొద్దీ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సెస్ లో అవినీతి చేసిన వారిని తాము అధికారంలోకి వచ్చాక వదలబోమని హెచ్చరించారు.