బీఎల్ సంతోష్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కుటుంబానికి లేదు : రాణి రుద్రమ

బీఎల్ సంతోష్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కుటుంబానికి లేదు : రాణి రుద్రమ

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కుటుంబానికి లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ మీరే  స్క్రిప్ట్ రాసుకొని, వీడియో, ఆడియోలను మీరే ఎడిట్ చేసుకొని డ్రామాలాడుతున్నారని టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. శవాల మీద పేళాలు ఏరుకున్నట్టుగా కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

లిక్కర్, గ్రానైట్, ఇసుక వ్యాపారం చేసి దుబాయ్ లోని  బుర్జు ఖలీఫాలో ఫ్లాట్లు కొనుక్కునే వారు కూడా బీజేపీ గురించి, ఆ పార్టీ నేత సంతోష్ గురించి మాట్లాడడం ఏమిటని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కేసీఆర్ కుటుంబం కవిత, కేటీఆర్, హరీశ్ రావు ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆరే దర్యాప్తు సంస్థల  అధికారులపై దాడి చేయమని చెపుతున్నారని ఆరోపించారు. ఐటీ అధికారులు రైడ్స్ కు వస్తే అడ్డుకుంటారా.. తెలంగాణలో రౌడీరాజ్యం తేవాలని చూస్తున్నారా అని ఫైర్ అయ్యారు. బీజేపీపై, పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు.