
డెహ్రాడూన్: ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామితో పాటు 12 వేల మంది భక్తులు హాజరయ్యారు. చార్‌ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం శీతాకాల విరామం తర్వాత తెరుచుకుంది. ఈ సందర్భంగా నేపాల్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి 54 రకాల 108 క్వింటాళ్ల పూలను తీసుకొచ్చి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. హెలికాప్టర్ ద్వారా ఆలయ గోపురంపైకి పూలు చల్లారు. చార్‌ధామ్‌లోని నాలుగు ఆలయాల్లో 11వ జ్యోతిర్లింగం అయిన కేదార్‌నాథ్‌ను ఏటా భక్తులు అత్యధిక సంఖ్యలో దర్శించుకుంటారు.
శుక్రవారం ఉదయం 5 గంటలకు కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని తెరిచామని బద్రినాథ్, కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) మీడియా ఇన్‌చార్జ్ హరీశ్ గౌర్ తెలిపారు. ప్రధాన అర్చకులతో కలిసి సీఎం ధామి ఆలయంలో మొదటిపూజ చేశారు. అలాగే, వారణాసి, హరిద్వార్, రిషికేశ్‌లో గంగా హారతి తరహాలో.. కేదార్‌నాథ్‌లో మందాకిని, సరస్వతి నదుల సంగమం వద్ద హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీకేటీసీ సీఈవో విజయ్ థప్లియాల్ వెల్లడించారు. కాగా, చార్‌ధామ్‌లోని నాలుగు ఆలయాల్లో గంగోత్రి, యమునోత్రి ఇప్పటికే తెరుచుకోగా మే 4న బద్రినాథ్ ఆలయం తెరుచుకోనుంది. కేదార్‌నాథ్ ఆలయం తలుపులను నవంబర్ 3 న తిరిగి మూసివేస్తారు.