అన్ని పార్టీల చీఫ్‌‌లను కలుస్త : కేజ్రీవాల్

అన్ని పార్టీల చీఫ్‌‌లను కలుస్త : కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌తో బీహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. ఆదివారం ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి ఆర్జేడీ నేత, బీహార్‌‌‌‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌‌తో కలిసి నితీశ్ వెళ్లారు. ఢిల్లీ అధికారాల విషయంలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌‌కు వ్యతిరేకంగా ఆప్ సర్కారుకు తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సమావేశం తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తా. ఆర్డినెన్స్‌‌ను రీప్లేస్ చేస్తూ కేంద్రం ఏదైనా బిల్లు తీసుకొస్తే రాజ్యసభలో పాస్‌‌ కాకుండా అడ్డుకునేందుకు మద్దతు కోరుతా. బిల్లు పాస్‌‌ చేయకుండా అడ్డుకుంటే.. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని సందేశం పంపొచ్చు. 2024 ఎన్నికలకు ఇది సెమీఫైనల్‌‌లా ఉంటుంది” అని కేజ్రీవాల్ అన్నారు.  ‘‘బెంగాల్‌‌ సీఎం మమతా బెనర్జీతో కోల్‌‌కతాలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భేటీ అవుతాను. ఆ తర్వాత అన్ని పార్టీల చీఫ్‌‌లను కలుస్తాను. ఈ విషయంలో ప్రతిపక్షాలతో మాట్లాడాలని నితీశ్‌‌ కుమార్​కు విజ్ఞప్తి చేశాను” అని కేజ్రీవాల్ వివరించారు. 

అధికారాలను లాగేసుకుంటరా?: నితీశ్

ఢిల్లీ అధికారాల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిన తర్వాత కేంద్రం ‘నేషనల్‌‌ క్యాపిటల్‌‌ సర్వీసెస్‌‌ అథారిటీ’ని ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్‌‌ తీసుకురావడాన్ని నితీశ్ కుమార్ తప్పుబట్టారు.  ‘‘ఎన్నికైన ప్రభుత్వానికి ఉన్న అధికారాలను మీరు ఎలా లాగేసుకుంటారు. రాజ్యాంగాన్ని చూడండి.. ఏది సరైనదో చూడండి. కేజ్రీవాల్ చెబుతున్నది కరెక్టు. మేం ఆయనకు అండగా ఉన్నాం” అని వివరించారు. ఢిల్లీలో కేజ్రీ సర్కారు పని చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. అందుకే దేశంలోని అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని తాము పిలుపునిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు తాను ప్రయత్నిస్తానన్నారు. ప్రజల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని, అలాంటి వాటిని ఆపేయాలని అన్నారు. ఢిల్లీ వివాదం విషయంలో కాంగ్రెస్ నాయకత్వంతో  మాట్లాడుతానని చెప్పారు. 

బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తున్నది: తేజస్వీ

వివిధ రాష్ట్రాల్లోని నాన్–బీజేపీ ప్రభుత్వాలను కేంద్రం నిరంతరం ఇబ్బంది పెడుతోందని, వేధిస్తోందని తేజస్వీ యాదవ్ అన్నారు. కేజ్రీవాల్‌‌కు సపోర్ట్ ఇచ్చేందుకే వచ్చామని, బీజేపీ ప్రభుత్వం ఆయనకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చాలనే వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.