ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాలే ఇయ్యాల కోర్టుకు చెప్తరు

ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాలే ఇయ్యాల కోర్టుకు చెప్తరు
  •  లిక్కర్ స్కామ్​లో కీలక ఆధారాలు సమర్పిస్తారు: సునీత కేజ్రీవాల్
  • రెండేండ్లలో 250 సార్లు ఈడీ సోదాలు చేసింది
  • ఎక్కడా సొమ్ము దొరకలేదు
  • మా ఇంట్లో రూ.73వేలు దొరికితే లెక్క చెప్పామని వెల్లడి

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రెండేండ్లలో ఈడీ అధికారులు 250 సార్లకు పైగా సోదాలు చేశారని, అయినా ఎక్కడా డబ్బులు దొరకలేదని ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ తెలిపారు. ఈ విషయాన్ని అర్వింద్ కేజ్రీవాలే తనకు చెప్పినట్టు వివరించారు. లిక్కర్ స్కామ్​కు సంబంధించిన డబ్బు ఎక్కడ ఉందో అర్వింద్ కేజ్రీవాల్ గురువారం కోర్టులో చెప్తారన్నారు. కీలకమైన ఆధారాలు కూడా సమర్పిస్తారని వివరించారు. బుధవారం అర్వింద్ కేజ్రీవాల్​తో ఆమె భేటీ అయ్యారు. తర్వాత సునీత కేజ్రీవాల్ మాట్లాడారు. 

‘‘లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బు ఎక్కడ ఉందో సీఎం కేజ్రీవాల్ గురువారం కోర్టుకు చెప్తారు. ఈ స్కామ్​కు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు కూడా కోర్టుకు అందజేస్తారు. గురువారంతో ఆయన కస్టడీ ముగుస్తుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనే స్వయంగా కోర్టుకు వెల్లడిస్తారు. రెండేండ్ల కాలంలో ఈడీ చేసిన సోదాల గురించి ఆయన నాకు చెప్పారు. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. కానీ రూపాయి కూడా దొరకలేదు. మా ఇంట్లో రూ.73 వేలు దొరికాయి. వాటికి కూడా లెక్క చెప్పాం’’అని సునీత తెలిపారు. 

క్షీణిస్తున్న అర్వింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నదని తెలిపారు. కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ అని, ఈడీ అధికారులు ఆయన హెల్త్ గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒకానొక టైమ్​లో బ్లడ్​లో షుగర్ లెవల్స్ 46 మిల్లీ గ్రామ్​కు పడిపోయినట్టు డాక్టర్లు చెప్పారని వివరించారు. ఈ స్థాయికి పడిపోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని చెప్పారు. 

బుధవారం ఉదయం అర్వింద్ కేజ్రీవాల్​తో ఆయన భార్య సునీత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెల్త్ గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ‘‘ అర్వింద్ ఆరోగ్యం క్షీణిస్తున్నది. బ్లడ్​లో షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి. ఆయనకేం కావొద్దని, ఆరోగ్యంగా ఉండాలని దేవున్ని ప్రార్థిద్దాం’’ అంటూ ఆప్ నేతలు, కార్యకర్తలు, అభిమానులను సునీత కేజ్రీవాల్ కోరారు.

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్​కు దక్కని ఊరట

ఢిల్లీ హైకోర్టులో అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్​పై బుధవారం విచారణ జరిగింది. అయితే, ఆయనకు హైకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. కస్టడీ ముగిసే దాకా ఈడీ అధికారుల విచారణకు సహకరించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ సూచించారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్​పై ఏప్రిల్ 2లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులను ఆదేశించారు. కేజ్రీవాల్ తరఫున కపిల్ సిబల్, ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్​వీ రాజు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు.

మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్​పై అమెరికా చేసిన వ్యాఖ్యలను దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సంబంధాలు దెబ్బతింటాయని తేల్చి చెప్పింది. ఢిల్లీలోని అమెరికా డిప్లొమాట్​కు సమన్లు జారీ చేసింది. అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌‌ ఆఫ్‌‌ మిషన్‌‌ గ్లోరియా బెర్బేనాను సౌత్‌‌ బ్లాక్‌‌లోని విదేశాంగ శాఖ ఆఫీసుకు పిలిపించారు. సుమారు 30 నిమిషాలు విదేశాంగ శాఖ అధికారులు ఆమెతో సమావేశం అయ్యారు.

 కేజ్రీవాల్ అరెస్ట్​పై అమెరికా కామెంట్లను ఖండిస్తున్నట్టు స్పష్టం చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని సూచించారు. తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత అమెరికాకు ఎక్కువగా ఉంటుందన్నారు. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సంబంధాలు దెబ్బతినే అవకాశాలుంటాయని తేల్చి చెప్పారు. భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

కేజ్రీవాల్ చాలా ధైర్యవంతుడు, దేశభక్తుడు

‘‘గురువారం కోర్టులో నిజమేంటో అందరికీ చెప్తా అన్నారు. అర్వింద్ కేజ్రీవాల్ చాలా ధైర్యవంతుడు. దేశాన్ని ప్రేమించే వ్యక్తి. నిజాయితీపరుడు. డయాబెటిక్​తో బాధపడుతున్నా.. ఆయన సంకల్పం ఎంతో గొప్పది’’ అని సునీత కేజ్రీవాల్ అన్నారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ.. ఢిల్లీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. కేజ్రీవాల్ క్లీన్​చిట్​తో బయటపడాలని ప్రార్థించాలని కోరారు.