
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాంలో జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జులై 3 దాకా పొడిగించింది. రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. ఆయనను ఈడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చారు. కేజ్రీవాల్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో, సీబీఐ సమర్పించిన చార్జ్‌షీట్‌లోనూ కేజ్రీవాల్ పేరు లేదన్నారు.
రాజకీయ కక్షతోనే ఎన్నికలకు ముందు అరెస్ట్ చేశారన్నారు. దీంతో, లిక్కర్ పాలసీ కింద లైసెన్స్‌లు ఇచ్చేందుకు కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలున్నాయని కోర్టుకు ఈడీ తెలిపింది. బెయిల్ మంజూరు చేస్తే ఆ ఎవిడెన్స్‌లను మాయం చేసే అవకాశం ఉందని వాదించింది. అలా అందిన వంద కోట్లను పంజాబ్, గోవాఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందని ఆరోపించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చి 21న అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీం మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మే 10న బయటికి వచ్చిన ఆయన తిరిగి జూన్ 2న లొంగిపోయారు.