కేరళ బోటు ప్రమాదం.. 22కు చేరిన మృతుల సంఖ్య
ఒకే కుటుంబానికి చెందిన 12 మంది దుర్మరణం
మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లాలో టూరిస్టు బోటు మునిగిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతుల్లో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు. అందులో నలుగురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని తనూర్ ప్రాంతంలో తూవల్ తీరం బీచ్ వద్ద ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బోటు ఓనర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు తలా రూ.10 లక్షల పరిహారం ఇస్తామని సీఎం పినరయి విజయన్ తెలిపారు. పడవ ప్రమాదంపై సోమవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భేటీ తర్వాత మీడియాతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘‘ప్రమాదం జరిగినపుడు బోటులో ఎంత మంది ఉన్నారో తెలియదు. 40 మంది వద్ద టికెట్లు ఉండగా.. మరి కొంతమంది వద్ద టికెట్లు లేవని తెలిసింది. బోటుకు సేఫ్టీ సర్టిఫికెట్ కూడా లేదు. ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి. నీటిలో గల్లంతైన వారి కోసం అండర్ వాటర్ కెమెరాలు ఉపయోగించి గాలిస్తున్నారు. ఈ ఘటనపై నిపుణులతో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తం” అని సీఎం పేర్కొన్నారు. నియమాలు ఉల్లంఘించి బోటు నడిపినట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు. అలాగే, ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారని, మరో ఎనిమిది మంది ట్రీట్మెంట్ పొందుతున్నారని సీఎం వెల్లడించారు.
సంతాప దినంగా ప్రకటన
పడవ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల గౌరవార్థం సోమవారాన్ని సంతాప దినంగా సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను వాయిదా వేశామని ఆయన చెప్పారు. కాగా, బోటు ఓనర్ ఇంకా పరారీలో ఉన్నాడని, అతడికోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా నేతల సంతాపం
పడవ ప్రమాదంపై రాజకీయాలకు అతీతంగా నేతలు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సానుభూతి ప్రకటించారు. కాంగ్రెస్ నేత, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్లలో అధికారులకు సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. అలాగే కేరళ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు.
